దళిత బంధు ఎఫెక్ట్.. పల్లెకు కదిలిన ‘కార్పొరేట్’

by Anukaran |   ( Updated:2021-08-30 21:58:48.0  )
దళిత బంధు ఎఫెక్ట్.. పల్లెకు కదిలిన ‘కార్పొరేట్’
X

కార్లు, ట్రాక్టర్ల కంపెనీలు పల్లెబాట పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారిపోనున్నది. మారుమూల గ్రామాల్లోనూ కార్లు, ట్రాక్టర్లు సందడి చేయనున్నాయి. లబ్ధిదారుల్లో చాలా మంది ట్రాక్టర్లు, కార్లు కొనుగోలు చేసేందుకు, డెయిరీ పరిశ్రమను స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోనున్నది. గ్రామాల్లో పశువైద్యులు, సిబ్బంది అవసరం కూడా భారీగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కరీంనగర్​జిల్లాలోని పలు ద్వితీయశ్రేణి పట్టణాల్లో షోరూముల ఏర్పాటుకు మహింద్రా, మారుతి కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’స్కీమ్‌ తీసుకురావడంతో ఇప్పుడు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సరికొత్త మార్పు కనిపిస్తున్నది. గ్రామాల ముఖచిత్రం మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందుతుండడంతో ఎక్కువ మంది లబ్ధిదారులు ట్రాక్టర్లు, కార్లను కొనడానికే మొగ్గు చూపుతున్నారు. మరికొంత మంది డెయిరీ వ్యాపారం వైపు చూస్తున్నారు. దీంతో కార్లకు, ట్రాక్టర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకున్న మారుతి కార్ల తయారీ సంస్థ ప్రతినిధులు, ట్రాక్టర్లను తయారుచేసే మహింద్రా సంస్థ ఎగ్జిక్యూటివ్‌లు కరీంనగర్ జిల్లా అధికారులతో ఒక దఫా చర్చలు జరిపారు. ఇదే క్రమంలో అనేక జిల్లాల్లో కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతున్నది.

మరికొంత మంది లబ్ధిదారులు పాల వ్యాపారం చేసుకోడానికి ఆసక్తి చూపుతున్నందున డీఆర్‌డీఏ అధికారులు డెయిరీ సంస్థలను సంప్రదించాలనుకుంటున్నారు. ఏ రకం గేదెలు, ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయి..? అవి ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి? వాటి ఖరీదు ఎంత? పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే వివరాలను సేకరిస్తున్నారు. ముర్రా, ఒంగోలు జాతి గేదెలపై ఇప్పటికే సమగ్ర సమాచారాన్ని సేకరించారు. భారీ సంఖ్యలో పాడి పశువుల కొనే అవకాశం ఉంది. ఈ మేరకు పశువైద్య నిపుణుల (డాక్టర్ల)ను కూడా ఎక్కువ సంఖ్యలోనే నియమించుకోవాల్సిన అవసరం ఉంటుందని జిల్లా అధికారులు అంటున్నారు.

ప్రస్తుతానికి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే ‘దళితబంధు’పైలట్ ప్రాజెక్టు పద్ధతిలో పూర్తిస్థాయిలో అమలవుతున్నందున తొలుత అక్కడే కసరత్తు వేగవంతమైంది. మున్ముందు అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇకపైన క్యాబ్ సర్వీసులకు, ట్రాక్టర్లకు పెరిగే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలాంటి షోరూమ్‌లు వచ్చే అవకాశం ఉంది. కరోనా కారణంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. సెకండ్ వేవ్ తర్వాత పుంజుకుంటున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దళితబంధు’పథకం సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నది.

చిన్న పట్టణాల్లోనూ షోరూములు..

‘దళితబంధు ’ పథకం గ్రామ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చివేయనున్నట్లు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక వేత్తల అంచనా. ఈ పథకం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం ప్రభుత్వానికి కత్తి మీద సాములాంటి వ్యవహారమే అయినా.. సమగ్రంగా అమలైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు చేకూరుతాయని, కరోనా లాంటి సంక్షోభ సమయాల్లో మొత్తం రాష్ట్రాన్నే ఆదుకోడానికి దోహదపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలు నిలదొక్కుకోడానికి, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో గానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత గానీ రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు స్వల్ప స్థాయిలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్​, ఖమ్మం లాంటి పెద్ద పట్టణాల్లో మాత్రమే ఆటోమొబైల్ వ్యాపారం ఓ స్థాయిలో ఉండేది. ఇప్పుడు పట్టణాలకూ ఆ రంగం వ్యాపారం విస్తరించడానికి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. దళితబంధు ప్రభావాన్ని అంచనా వేసిన కార్ల, ట్రాక్టర్ల తయారీ సంస్థలు ఇప్పటి నుంచే తెలంగాణలోని వివిధ జిల్లా కేంద్రాల్లో వ్యాపారాన్ని విస్తరింపజేసుకోడానికి వ్యూహం రచిస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంతో మొదలైన ఈ ప్రక్రియ సమీప భవిష్యత్తులో రాష్ట్రమంతటికీ వ్యాప్తి చెందడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు కరీంనగర్ జిల్లా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

పశువైద్యులు కావలెను..

ఇంతకాలం పశు వైద్యుల అవసరం పెద్దగా లేకపోయినా భవిష్యత్తులో వారికి భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడనున్నది. దళితబంధు పథకం కింద ఆర్థికంగా సెటిల్ కావడానికి పాల వ్యాపారాన్ని ఎంచుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా ఉన్నది. పశు సంపద పెరగడం ద్వారా పశు వైద్యుల అవసరం కూడా పెరగనున్నది. దీంతో రాష్ట్రం మొత్తం అవసరాలకు వందలాది మంది వెటర్నరీ డాక్టర్ల అవసరం ఏర్పడుతుందని కరీంనగర్ జిల్లా అధికారులు అంచనా వేశారు. దీనికి తోడు పాల ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను కూడా బలోపేతం చేయాల్సి వస్తున్నట్లు పేర్కొన్నారు. డైరీ టెక్నాలజీ రంగానికి చెందిన నిపుణుల నుంచి ప్రాసెసింగ్ ఇండస్ట్రీలను నెలకొల్పడంపై సెకండ్ ఫేజ్‌లో ప్రభుత్వాధికారులు సీరియస్ దృష్టి పెట్టనున్నారు.

Advertisement

Next Story