నోరు మూసుకోండి..!

by Sumithra |
నోరు మూసుకోండి..!
X

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఇటీవల సైబర్ మోసాలు అత్యధికంగా జరుగుతున్నాయి. తమ వ్యక్తిగత ఖాతా వివరాలను గోప్యంగా దాచుకోవాలని పోలీసులు, బ్యాంకు అధికారులు పలుమార్లు మొత్తుకుంటున్నా.. అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉంటున్నారు. తమ ఖాతాల నుంచి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరాలపై అనేక కేసులు నమోదవుతున్నా.. మోసగాళ్లను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెడుతున్నా.. నేరగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటూ అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. సైబర్ మోసాలకు ఇంటర్నెట్ ఆధారిత వాట్సాప్, ఫేస్‎బుక్ తదితర వేదికలు ప్రధానం అవుతున్నాయి. వీటిలో మన సమాచారన్ని గోప్యతగా ఉంచుకోవడానికి అవకాశం ఉన్నా.. మోసాలను గ్రహించడంలో అవగాహన రాహిత్యంతో ఇంకా మోసపోతూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

లిఫ్ట్ చేస్తే గల్లంతే…

ప్రస్తుతం అత్యధికంగా వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లలో మనకు ఫోన్ రాగానే.. ఎవరైతే మనకు ఫోన్ చేస్తున్నారో వారి నెంబరుతో పాటు ఫోటో కూడా సెట్టింగ్ చేసుకోడానికి ఆఫ్షన్ సౌకర్యం ఉంది. ఫోన్ రింగ్ కాగానే మన స్నేహితుడు, స్నేహితురాలి ఫోటోను మన ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ఆసక్తిగా లిఫ్ట్ చేస్తాం. అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం అనే విషయాన్ని గ్రహించాల్సి ఉంది. నిజానికి ఆ సమయంలో ఫోన్ రింగ్ కాగానే కనిపించిది మన మిత్రుడు ఫోటోనే. కానీ, ఆ సమయంలో ఫోటోతో పాటు నెంబరును కూడా గమనించాలని అంటున్నారు పోలీసులు. లేదంటే, ఫోన్‌లో ఉన్న మన సమాచారం అంతా గల్లంతు అవుతుందంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు వాట్సాప్, ఫేస్‎బుక్ వేదికలను సెర్చ్ చేస్తున్న క్రమంలో.. మన ఫోన్ నెంబరుతో పాటు మన మిత్రుల ఫోటోలను కూడా సేకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా మన ఫేస్‎బుక్ అకౌంట్ నుంచి మన నెంబరుతో పాటు మన ఫ్రెండ్ ఫోటోను కూడా మోసగాళ్లు సేకరిస్తున్నారు. ఈ ఫోటోను మన నెంబరుతో సేవ్ చేస్తున్నారు. దీంతో సాధారణంగానే మనకు కాల్ చేయగానే మన ఫ్రెండ్ ఫోటో కనిపిస్తోంది. దీంతో వెంటనే మనకు ఏ నెంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చిందో గ్రహించకుండానే, మన ఫ్రెండ్ ఫోటో చూసి కాల్ లిఫ్ట్ చేస్తున్నాం. ఈ తరహా మోసపూరిత కాల్స్ లిఫ్ట్ చేసినప్పుడు మన ఫోన్ లోని సమాచారం అంతా మోసగాళ్లకు చేరుతోందనే విషయాన్ని పోలీసులు గుర్తించారు.

నోరు మూసుకోండి..

మన ఫోన్ నెంబర్లకు మన ఫ్రెండ్స్ ఫోటోలను సెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న కొన్ని సిరీస్ నెంబర్లను పోలీసులు గుర్తించారు. వాటిలో +92, +1, +968, +44 తదితర సిరీస్ నెంబర్లను అత్యధికంగా మోసగాళ్లు వినియోగిస్తున్నట్టుగా సైబర్ పోలీసులు గుర్తించారు. ఈ సిరీస్ నెంబర్లపై వచ్చే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు మూహ్ బంద్ రఖో అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూహ్ బంద్ అంటే నోరు మూసుకోండి అని అర్థం. అందుకు పలు బ్యాంకులతో కలిసి ప్రజల్లో అవగాహన పెంచేందుకు వర్క్‌షాపులు నిర్వహించాలని భావించారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్నేషనల్‌ అవేర్‌నెస్‌ వీక్‌-2020లో భాగంగా +92,+1,+968,+44 సిరీస్ నెంబర్లతో వచ్చే ఫోన్ నెంబర్లను లిఫ్ట్ చేయోద్దంటూ 4 నెలల ప్రచార కార్యక్రమాన్ని సైబరాబాద్ పోలీసులు ప్రారంభించారు. ఈ 4 నెలల కాలంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 1000 వర్క్ షాపులు నిర్వహించాలని సైబర్ పోలీసులు భావిస్తున్నారు. ఇలా మనకొచ్చే ప్రతి ఫోన్ కాల్ సిరీస్ నెంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ఆ నెంబర్లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed