క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకపోవడమే మంచిది.. సైబర్ నిపుణుడి సూచన

by Shyam |   ( Updated:2021-09-23 07:57:02.0  )
Cyber ​​expert Arun Soni
X

దిశ, పటాన్‌చెరు: హానికరమైన క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేయకపోవడమే మంచిదని, క్యూర్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తే అది హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ధ్రువీకృత ఎథికల్ హ్యాకర్, అంతర్జాతీయ రచయిత, వక్త అరుణ్ సోని హెచ్చరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సైబర్ భద్రతపై అవగాహన కోసం గురువారం వెబినార్‌ నిర్వహించారు. ఈ వెబినార్‌లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం, CYSEC విద్యార్థి విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తరువాత మన ఫోన్‌లోకి ప్రమాదకరమైన మాల్వేర్ పంపొచ్చని, వివిధ హానికరమైన ప్రయోజనాల కోసం హ్యాకర్లు ఆ కోడ్‌ను వినియోగిస్తారని చెప్పారు. ఫోన్‌లోకి వచ్చిన మాల్వేర్ మన సమాచారాన్నంతా రహస్యంగా సేకరించి హ్యాకర్‌కు పంపే అవకాశం ఉందన్నారు.

యూపీఐ యాప్‌లకు అనుసంధానం చేయడానికి ఎప్పుడూ ప్రత్యేక బ్యాంక్ ఖాతాను ఉపయోగించాలని, అయితే ఆ ఖాతాలో ఎక్కువ డబ్బును ఉంచొద్దని ఆరుణ్ సోని సూచించారు. యూపీణ యాప్ ద్వారా తప్పుడు లావాదేవీ జరిగితే వెంటనే సెట్టింగ్స్‌లోని రెయిజ్ డిప్యూటీ అనే ప్రత్యామ్నాయాన్ని తక్షణమే వినియోగించుకోవాలన్నారు. హ్యాకింగ్, సైబర్ బెదిరింపు వంటి వాటి గురించి అరుణ్ సోని వివరించారు. విద్యార్ధులు లేవనెత్తిన పలు సందేహాలకు జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. తొలుత, ఈఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి తమ విభాగం గురించి వివరించగా, వెబినార్ నిర్వాహకుడు నరేష్ కుమార్ అతిథిని స్వాగతించారు. గీతం మూడు ప్రాంగణాలకు చెందిన విద్యార్థులు, ఆధ్యాపకులు ఇందులో పాల్గొని సైబర్ భద్రతపై తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Advertisement

Next Story