‘ఆన్‌లైన్ లిక్కరు’.. చీటర్స్‌కు చిక్కేరు!

by Shyam |
‘ఆన్‌లైన్ లిక్కరు’.. చీటర్స్‌కు చిక్కేరు!
X

దిశ, వెబ్‌డెస్క్: నోవెల్ కరోనా వైరస్‌ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ అమలులో మద్యం దుకాణాలు మూసివేసి ఉండటంతో అదే అదునుగా చూసుకొని సైబర్‌ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎరవేస్తున్నారు. ‘‘మీరు మద్యం ప్రియులా.. మద్యం తాగాలని ఉబలాట పడుతున్నారా.. లాక్‌డౌన్‌ వేళ మీకు ఎక్కడా లభించని మద్యాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇవ్వగానే మీ ఇంటికొచ్చి మరీ ఇస్తాం’’ అంటూ సైబర్‌ నేరగాళ్లు ప్రకటనలు చేస్తూ రెచ్చిపోతున్నారు.

ప్రజల ఆశను క్యాష్‌గా మలచుకొని వారి ఖాతాల్లో డబ్బులను గుల్ల చేస్తున్నారు కొందరు. అయితే, ఈ లాక్ డౌన్ సమయాన అసలు మద్యం అమ్మకానికి అనుమతి లేదనీ, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటువంటి ప్రకటనలు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

గూగుల్ సెర్చ్ ఆప్షన్లతో..

ఆధునిక సాంకేతికతపై మంచి అవగాహన ఉన్న సైబర్ నేరగాళ్లు గూగుల్‌ సెర్చ్‌ ఆప్షన్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న వైన్‌షాప్‌ల పేరుతో తమ నెంబర్లను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. గూగుల్‌ సెర్చింజన్‌లో ‘వైన్‌షాప్‌ నియర్‌ మీ’ అని టైప్ చేయగానే వచ్చేలా చిరునామాలు అందుబాటులో ఉంచారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఇది నిజమేననుకొని కొంతమంది ఆ లింక్‌ క్లిక్ చేస్తున్నారు. వారు అడిగిన దానికి రెండింతల రేటుకు డబ్బులను బ్యాంక్‌ ఖాతాల నుంచి ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తున్నారు. కానీ, ఆ తర్వాత సదరు వ్యక్తి ఆయా నెంబర్లను సంప్రదిస్తే ఎటువంటి స్పందన ఉండటం లేదు. ఇటువంటి రెండు కేసులు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదయ్యాయి. అందుకే ఆన్‌లైన్‌ల ద్వారా ఆర్డరిస్తే ఇంటికే మందు అనే లింక్‌లను నమ్మొద్దనీ, లాక్‌డౌన్‌ వేళ అసలు మద్యం అమ్మకాలకు అనుమతి లేదని సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఈ రకంగా ప్రజలను మోసం చేసే నేరగాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Tags: cyber crimes, in the name of, wines, online, be alert, police, dcp rohini

Advertisement

Next Story