Latest National and International Current Affairs: 19-5-2023

by Harish |   ( Updated:2023-05-19 15:12:39.0  )
Latest National and International Current Affairs: 19-5-2023
X

అంతర్జాతీయం:

భారత్ ఇండోనేసియా నౌకాదళ విన్యాసాలు ప్రారంభం:

భారత్, ఇండోనేసియా నౌకాదళాల సంయుక్త విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు సాగే యుద్ధ క్రీడలకు సముద్ర శక్తి అని పేరు పెట్టారు. ఇండోనేషియాకు సమీపంలో ఇవి జరుగుతున్నాయి. భారత్ తరఫున ఐఎన్ఎస్ కవరత్తి యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం డోర్నియర్, ఒక చేతక్ హెలికాప్టర్ పాలు పంచుకుంటున్నాయి. ఇండోనేషియాకు చెందిన కేఆర్ఐ సుల్తాన్ ఇస్కాందర్ ముదా యుద్ధనౌక, సీఎన్ 235 గస్తీ విమానం, ఏఎస్ 565 పాంథర్ హెలికాప్టర్ ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.

అమెరికాలో టైటిల్ 42 ఎత్తివేత:

అమెరికాలో ఆశ్రయం కోరేవారిపై టైటిల్ 42 పేరుతో కొనసాగిన ఆంక్షలు ముగిశాయి. దీని స్థానంలో కొత్త శరణార్థి విధానాన్ని అమెరికా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మెక్సికోతో పాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు శరణార్థుల తాకిడి గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటిని కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో కొవిడ్ - 19 విజృంభణ సమయంలో శరాణార్థులపై టైటిల్ 42 పేరుతో అమెరికా విధించిన ఆంక్షల గడువు ముగిసింది. దీని స్థానంలో బైడెన్ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. దీంతో అమెరికా సరిహద్దు భారీ సంఖ్యలో వలసదారులు తరలివస్తున్నారు.

కులవివక్ష నిషేధ బిల్లుకు కాలిఫోర్నియా సెనెట్ ఆమోదం:

కుల వివక్షను నిషేధిస్తూ కాలిఫోర్నియా సెనెట్ చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది. అమెరికాలో ఇలాంటి బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం కాలిపోర్నియానే కావడం గమనార్హం. అఫ్గానిస్థాన్ సంతతికి చెందిన సెనేటర్ అయిషా వాహబ్ గత నెలలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ట్విట్టర్ కొత్త సీఈవోగా లిండా యాకరినా:

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్‌కు కొత్త సీఈఓగా లిండా యాకరినా నియమితులయ్యారు. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ నుంచి ఆమె ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రధానంగా ట్విట్టర్ వ్యాపార కార్యకలాపాల పైనే లిండా దృష్టి సారిస్తారని ట్విట్టర్ ద్వారా మస్క్ తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీటీఓ, హోదాలో ప్రోడక్ట్ డిజైన్, కొత్త సాంకేతికతల బాధ్యతలను ఆమె నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.

పర్వతారోహకుడు కమీ రీటా రికార్డు:

ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కమీ రీటా (53) 27 సార్లు అధిరోహించి తన రికార్డును తానే తిరగరాశాడు. తూర్పు నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లాకు చెందిన కమీ రీటా పర్వతారోహకులకు గైడ్‌గా పనిచేస్తున్నారు. తన తోటి షెర్పా అయిన పసంగ్ దేవా (46) 26 సార్లు ఎక్కి తన పూర్వ రికార్డును సమం చేసిన మూడు రోజుల్లోనే కమీ రీటా ఈ ఘనతను సాధించారు.

ఐరాస వలస విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా యామీ పోప్:

ఐక్యరాజ్యసమితి వలస విభాగామైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం)డైరెక్టర్ జనరల్‌గా అమెరికాకు చెందిన యామీ పోప్ ఎంపికయ్యారు. ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా ఓ మహిళ ఎంపికవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న యామీ ఈ మేరకు జరిగిన ఎన్నికలో పోర్చుగీసు ప్రభుత్వ మాజీ మంత్రి ఆంటోనియోను ఓడించారు.

ఇవి కూడా చదవండి:

SJVN లిమిటెడ్‌లో 51 మేనేజర్ పోస్టులు

Advertisement

Next Story