డిజిటల్ చెల్లింపులకు నియంత్రణ మౌలిక సదుపాయాలు అవసరం: ఎస్‌బీఐ!

by Harish |
డిజిటల్ చెల్లింపులకు నియంత్రణ మౌలిక సదుపాయాలు అవసరం: ఎస్‌బీఐ!
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఐదేళ్ల కాలంలో దేశీయంగా డిజిటల్ చెల్లింపులు పెద్ద ఎత్తున పెరిగాయి. ఈ తరుణంలో డిజిటల్ విప్లవానికి మద్దతునిచ్చేందుకు నియంత్రణ మౌలిక సదుపాయాలు అవసరమని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగినప్పటికీ దీపావళి సమయంలో చెలామణిలో ఉన్న కరెన్సీ స్థిరంగా ఉందని, డిజిటల్ చెల్లింపులు వేగవంతం అయ్యాయని ఎస్‌బీఐ నివేదిక అభిప్రాయపడింది.

‘ఈ ఏడాది దీపావళికి రికార్డు స్థాయిలో రూ.1.25 లక్షల కోట్ల కొనుగోళ్లు జరిగినప్పటికీ, చలామణిలో ఉన్న కరెన్సీ గతేడాది కంటే స్థిరంగా ఉంది. 2014 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి’ అని ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. దీపావళి పండుగ వారంలో చెలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.43,900 కోట్లుగా ఉండగా, ఇది గతేడాది సమయంలో రూ.43,800 కోట్ల స్థాయిలోనే ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో మొత్తం 350 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి.

విలువ రూపంలో ఇది రూ.6.3 లక్షల కోట్లు కాగా గతేడాది కంటే సంఖ్యా పరంగా 100 శాతం, విలువ పరంగా 103 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. 2017 నుంచి యూపీఐ లావాదేవీలు 69 రెట్లు పెరిగాయని, అయితే ఈ సమయంలో డెబిట్ కార్డ్ లావాదేవీలు చాలాసార్లు ప్రతికూలంగా మారాయి. దీంతో ప్రజలు ఎక్కువగా యూపీఐ చెల్లింపులకు మారినట్టు ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది.

‘భారతీయ వినియోగదారులు ఇప్పుడు సులభమైన చెల్లింపుల సౌకర్యాలను ఇష్టపడుతున్నారు. కస్టమర్లు మెషిన్, ఇతర తరహా కంటే యూపీఐ లాంటి విధానాలకు మారుతున్నారు. దీనివల్ల సెంట్రల్ బ్యాంకులు, ప్రభుత్వ జోక్యంతో కూడిన నియంత్రణ అవసరం ఉందని’ ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed