లాక్‌డౌన్ ఎఫెక్ట్.. పల్లెబాట పట్టిన వలస కార్మికులు

by Shamantha N |
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. పల్లెబాట పట్టిన వలస కార్మికులు
X

గాంధీనగర్, ముంబయి : కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పాక్షిక లాక్‌డౌన్‌లు, కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‎లలో కేసుల పెరుగుదల, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటికే మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు, వారాంతపు రోజుల్లో లాక్‌డౌన్ అమలవుతున్నది. గుజరాత్‎లోని రెండు ప్రధాన పారిశ్రామిక నగరాలైన అహ్మదాబాద్, సూరత్‎లలో కూడా వైరస్ వ్యాప్తి కారణంగా రోజురోజుకూ ఆంక్షలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు చోట్ల మరోసారి గతేడాది మాదిరి లాక్‌డౌన్ తప్పేలా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దీంతో ఉపాధి కోసం అక్కడికి వచ్చిన వలస కార్మికులు గతేడాది అనుభవాలను తలుచుకుని ముందే మేల్కొంటున్నారు. రైలు, బస్సు, ప్రైవేట్ వాహనాలు.. ఏది అందుబాటులో ఉంటే దానిలో స్వగ్రామాలకు పయనమవుతున్నారు. పనుల్లేక పస్తులుండేకంటే గ్రామాలకు వెళ్లడమే బెటరని పట్టణాలను వీడుతున్నారు. ఇప్పటికే ముంబయి నుంచి వేలాది మంది వలస కార్మికులు సొంతూళ్లకు మళ్లుతున్న విషయం తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్, సూరత్‎ల నుంచి చాలా మంది స్వగ్రామాలకు వెళ్తున్నట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‎కు చెందిన వారే కావడం గమనార్హం.

ఆంక్షలు.. ఆజ్ఞలు.. కర్ఫ్యూలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా పలు రాష్ట్రాలు ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్‎లు విధిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో మధ్యప్రదేశ్ కూడా చేరింది. మధ్యప్రదేశ్‎లో వారాంతపు లాక్‌డౌన్‎ను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారాంతాల్లో 60 గంటల పాటు అంటే.. శుక్రవారం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల దాకా లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ ఉత్తర్వులు నేటి నుంచే రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, జిల్లా కేంద్రాలలో అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్ వంటి పట్టణాలతో పాటు 52 జిల్లాలున్నాయి. దీంతో పాటు పట్టణ కేంద్రాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా రాత్రి పూట కర్ఫ్యూను పక్కాగా అమలు చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

మధ్యప్రదేశ్‌తో పాటు యూపీలోని నోయిడాలో కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తూ స్థానిక యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 17 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇక తమిళనాడులో ఏప్రిల్ 10) నుంచి రాష్ట్రవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటి ప్రకారం.. ఫంక్షన్లు, మీటింగులు, రాజకీయ సభలకు అనుమతుల్లేవు. అంతర్ జిల్లా, రాష్ట్రాలకు వెళ్లే బస్సులలో ప్రయాణికులు సీట్ల వరకు మాత్రమే కూర్చోవాలి. షాపులు 50 శాతం ఉద్యోగులతో నిర్వహించుకోవాలి. వీటితో పాటు గతేడాది కొవిడ్ కట్టడికి కేంద్రం విధించిన మార్గదర్శకాలను ప్రజలంతా విధిగా పాటించాలి. కాగా.. ఇటీవలే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తాజా ఆంక్షలను విధించడం గమనార్హం. కాగా, అసోంలో మాత్రం లాక్‌డౌన్ విధించబోమని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Next Story