అక్కడ మహిళలదే పై చేయి.. ఆ విషయాల్లో కూడా

by Shyam |
అక్కడ మహిళలదే పై చేయి.. ఆ విషయాల్లో కూడా
X

దిశ, ఫీచర్స్ : కంప్యూటర్ యుగమైనా సరే.. ఈ సమాజం అమ్మాయి కాళ్లకు కళ్లెం వేస్తోంది. ప్రతీ రంగంలో మగాడితో సమానంగా ఎదుగుతున్నా, పెళ్లి విషయంలో మాత్రం నచ్చినవాడిని ఎంచుకుంటే తప్పుచేసిందనే ఆలోచనలోనే ఉండిపోయింది. స్వేచ్ఛగా బతకాలనుకుంటే, బరితెగించిందనే నిందలు వేస్తోంది. కానీ సొసైటీకి దూరంగా తమ సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్న ఓ తెగ మాత్రం స్త్రీలకు సరైన ప్రాధాన్యతనిస్తోంది. మ్యారేజ్, సెక్స్ విషయంలో మహిళలే తుదినిర్ణయం తీసుకునే ఆచారాన్ని కొనసాగిస్తోంది. సుమారు పదివేల జనాభాతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నివసించే రీనో ఆదివాసీ తెగ.. ప్రపంచంలోనే అరుదైన ఆదివాసీయుల్లో ఒకటి కాగా, పలు ఆచరణీయ సాంప్రదాయాలతో మన్ననలు అందుకుంటోంది.

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో రీనో తెగకు చెందిన గిరిజనులు నివసిస్తుంటారు. స్త్రీలు, పురుషులను సమానంగా చూసే ఈ తెగలో, యుక్త వయసుకు రాగానే మహిళలు గుండు చేయించుకుంటారు. అది కనిపించకుండా పూసల దండలను ఆభరణాలుగా అలంకరించుకుంటారు. గ్రామ పెద్ద, పూజారి, వైద్యులు పురుషులే అయినా ఈ తెగలో కుటుంబ పెద్ద మాత్రం మహిళే. తనే కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ వారి బాగోగులు చూసుకుంటుంది.

తక్కువ వయసున్న యువకులతో పెళ్లి..

రీనో యువతులు తమ కన్నా 10 నుంచి 12 ఏళ్లు తక్కువ వయసున్న యువకుడిని పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే చిన్న వయసున్న భర్తయితే వృద్ధాప్యంలో మహిళలకు సేవలు చేస్తారని వారి నమ్మకం. ఈ తెగలో అబ్బాయిలు, అమ్మాయిలు కుటుంబాలతో కాకుండా కొండపైన గుడెసెల్లో నివసిస్తుంటారు. ఈ గుడిసెల దగ్గర అబ్బాయిలు వాయిద్య పరికరాలు వాయిస్తూ అమ్మాయిల మనసు గెలిచేందుకు ప్రయత్నిస్తుంటారు. మొదట అబ్బాయే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అమ్మాయికి నచ్చకపోతే ఆ ప్రపోజల్‌కు అక్కడే ఎండ్ కార్డ్ పడే అవకాశముండగా.. నచ్చితే మాత్రం తను మాంసం వండి అబ్బాయికి పంపిస్తుంది. ఆ తర్వాత అబ్బాయి తరపువారు అమ్మాయి కుటుంబానికి ఎదురు కట్నమిచ్చి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వివాహతంతు పూర్తయ్యాక కూడా అమ్మాయి తన ఇష్టపూర్వకంగానే జీవిస్తుంది.

ఎగతాళి చేస్తే హత్యకు వెనకాడరు..

పెళ్లికి ముందు సెక్స్ గురించి పెద్దగా పట్టించుకోని ఈ తెగ మహిళలు.. సొంత గ్రామస్థులను మాత్రం అసలు వివాహం చేసుకోరు. భర్త చనిపోతే, ఇష్టాన్ని బట్టి మరో పెళ్లి కూడా చేసుకుంటారు. ఇక పురుషుడితో సమానంగా తెగింపు చూపించే రీనో స్త్రీలు.. జీలుగ కల్లు, ఇప్పసార సేవిస్తూ పురుషులతో సమానంగా ఆయుధాలు ధరించి సంచరిస్తుంటారు. అంతేకాదు స్ర్తీలను ఎగతాళి చేస్తే వారిని హత్యచేయడం కూడా ఈ తెగలో తప్పు కాదని వివరిస్తున్న చరిత్రకారులు.. ఆధునిక భారతం రీనో ఆదివాసీల నుంచి నేర్చుకోవాల్సిన, ఆచరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

– B K Rao

Advertisement

Next Story

Most Viewed