కాల్పుల్లో రక్తం చిందె… కనికరించి రక్తమిచ్చె..

by Shamantha N |
కాల్పుల్లో రక్తం చిందె… కనికరించి రక్తమిచ్చె..
X

మావోయిస్టులు, పోలీసులు.. భిన్న ధృవాలకు చెందినవారు. వారి మధ్య వ్యక్తిగత కక్షలు లేకున్నా.. వృత్తిరీత్యా అడవుల్లో ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతుంటాయి. ఈ కాల్పుల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. గురువారం జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భం జిల్లాల్లోని మాన్మరు-తెబో ప్రాంతం వద్ద కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. 60వ బెటాలియన్ పారామిలిటరీ దళాలు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ముగ్గురు మావోలు చనిపోయారు. ఇద్దరు పట్టుబడ్డారు. ఆ ఇద్దరిలో మనోజ్ హెస్సా అనే మావోయిస్టు తీవ్రంగా గాయపడటంతో అతన్ని టాటానగర్ ఆస్పత్రిలో చేర్పించారు.

ఇదేదో క్రైం న్యూస్ అప్‌డేట్ అనుకుంటే పొరపాటే.. ఈ సంఘటనలో మానవత్వాన్ని చాటుకున్న ఇద్దరు పోలీసుల గురించే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. పై కాల్పుల సంఘటనలో గాయపడ్డ మనోజ్ హెస్సాకు చాలా రక్తం పోయిందని టాటానగర్ ఆస్పత్రి సిబ్బంది వచ్చి పోలీసులకు చెప్పారు. అది విన్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్ ఓం ప్రకాశ్ యాదవ్, సందీప్ కుమార్‌లు తమ వృత్తిపర బేషజాలను పక్కన పెట్టి, మానవత్వానికి పెద్ద పీట వేశారు. వెంటనే తాము రక్తం దానం చేస్తామని వైద్యులకు చెప్పారు. ‘అన్నిదానాల్లోకెల్లా రక్తదానం గొప్పదనే విషయాన్ని గుర్తుచేసుకుని తాము ఈ సహాయం చేసినట్లు’ ఇద్దరూ ముక్తకంఠంతో చెప్పారు. కాగా తమ జవాన్లు ఇలా చేసినందుకు చాలా గర్వంగా ఉందని సీఆర్‌పీఎఫ్ ప్రతినిధి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మోసెస్ దినకరణ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed