- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై పంటల నమోదు పక్కాగా జరగాల్సిందే..
దిశ, తెలంగాణ బ్యూరో : ఈసారి ఖచ్చితత్వం ఉండేలా ధరణి సర్వే నంబర్ల ఆధారంగా పంటల నమోదు చేయించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన పంటల నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఉన్నతాధికారులు వెంటనే జిల్లాల్లో పర్యటించాలని సూచించారు. హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో వానాకాలం పంటల విస్తీర్ణం, పంటల సరళి, ఉత్పత్తి, వానాకాలంలో రాబోయే ధాన్యం కొనుగోళ్లు, యాసంగి విత్తన ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వ్యవసాయాధికారులకు ఇతర పనులు అప్పగించొద్దని సూచించారు. ప్రస్తుతం రైతులు క్షేత్రస్థాయిలో పంటలను వేసిన నేపథ్యంలో పంటల నమోదులో ఖచ్చితత్వం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంటల నమోదును 10 రోజుల్లో సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
త్వరలోనే వ్యవసాయ ప్రగతిపై సీఎం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటిస్తారని మంత్రి వెల్లడించారు. రైతు వేదికలలో జరిగే శిక్షణా తరగతుల్లో పంటల మార్పిడిపై ప్రధానంగా దృష్టి సారించి వ్యవసాయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు విస్తృతంగా ఇప్పటి నుంచే రైతుల్లోకి తీసుకెళ్లాలన్నారు. యాసంగిలో నూనెగింజలను ప్రోత్సహించడానికి వేరుశనగ సాగును పెంచేందుకు రాయితీపై విత్తనాలను సరఫరా చేసేందుకు అవకాశాలను అధికారులు వెంటనే పరిశీలించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పెరిగిన సాగు నీటి వసతుల నేపథ్యంలో ఒకే రకమైన పంటలు కాకుండా అన్నిరకాల పంటలు పండించేలా రైతులు తమ సాగు విధానాలను మార్చుకోవాలని కోరారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్తలు మాట్లాడుతూ యాసంగిలో ఆరుతడి పంటలైన వేరుశనగ, ఇతర నూనెగింజల పంటలైన ఆవాలు, నువ్వులు, కుసుమ, పొద్దు తిరుగుడు వంటి పంటలతో పాటు పప్పుశనగను ప్రోత్సహించాలని సూచించారు.
ఎఫ్‌సీఐ జీఎం దీపక్ శర్మ మాట్లాడుతూ ఇకపై ఎఫ్‌సీఐ నుంచి పరిమితంగానే వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తామని స్పష్టం చేశారు. వానాకాలం పంటల నుంచి కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ఎట్టి పరిస్థితిలోనూ దొడ్డు వడ్లను సేకరించడం కుదరదన్నారు. సన్నరకం వడ్లను మాత్రమే సేకరిస్తామని, ఈ యాసంగిలో వీలైనంత వరకు వరిసాగు చేయొద్దని సూచించారు. రైతులు దొడ్డ రకం సాగు చేయొద్దన్నారు. సమావేశంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్, శాస్త్రవేత్తలు జగన్మోహన్ రావు, వెంకటరమణ, శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు విజయ్ కుమార్, ఎండీ అగ్రోస్ రాములు తదితరులు పాల్గొన్నారు.