మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

by Shiva |   ( Updated:2024-01-15 05:43:34.0  )
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డస్క్ : ఆటో, కారు ఢీకొని నలుగురు దుర్మరణం పాలన ఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అర్బన్ పార్క్ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గూడూరు మండలం చిన్న ఎల్లాపురం ఆమూతండాకు చెందిన ఆటో డ్రైవర్‌ ఇస్లావత్‌ శ్రీను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గుంజేడు ప్రాంతంలో యానిమల్‌ ట్రాకర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, శ్రీనివాస్‌ తల్లి, ఇద్దరు పిల్లలు, అత్త, బావమరిదిని తీసుకొని ఈ నెల 13న సొంత ఆటోలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ సమీపాన ఉన్న బుడియాబాపు గుడికి తన కొడుకు పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి వెళ్లాడు.

అయితే,ఆ కార్యక్రమం ముగించుకుని నిన్న రాత్రి స్వగ్రామానికి ఆటో వస్తుండగా మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి అర్బన్‌ పార్కు వద్ద ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న డ్రైవర్‌ ఇస్లావత్‌ శ్రీను(35)తో పాటు ఆయన తల్లి పాప(60), కుమారుడు రిత్విక్‌(4), కుమార్తె రిత్విక(2) అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీను అత్త మాలోతు శాంతి, బావమరిది సర్దార్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి.

కాగా, కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మగుడికి నలుగురు మిత్రులతో వెళ్లి తిరిగి వస్తున్న మహబూబాబాద్‌ మండలం మల్యాల పీహెచ్‌సీ డాక్టర్‌ బాదావత్‌ తిరుపతితో పాటు కురవి మండలానికి చెందిన గుగులోత్‌ ప్రవీణ్‌, మాలోత్‌ భరత్‌, మహేష్‌, వసంత్‌లు కూడా గాయపడ్డారు. కారు నడిపింది డాక్టర్‌ తిరుపతి అని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story