BREAKING : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

by Shiva |   ( Updated:2024-01-29 07:15:56.0  )
BREAKING : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
X

దిశ, నల్లగొండ బ్యూరో/ వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు మృతి చెందారు. వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మిర్యాలగూడ నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్ (32), అతని భార్య జ్యోతి (30), కూతురు రిషిత (6), మహేశ్ తొడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లికి చెందిన భూమా మహేందర్ (32), ఈ ఘటనలో అతని కుమారుడు లియాన్సీ (2) చనిపోయాడు.

మహేందర్ భార్య భూమా మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర వైద్యం అందించి అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండో పట్టణ ఎస్సై క్రిస్టయ్య సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు. చెరుపల్లి మహేష్ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అనంతరం మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి తిరిగి వస్తుండగా అద్దంకి- నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఈ కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. నాలుగు నిమిషాల్లో ఇంటికి వెళ్లేవారని స్థానికులు తెలిపారు.

Advertisement

Next Story