వైద్యం వికటించి వ్యక్తి మృతి.. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ధర్నా

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-13 07:18:04.0  )
వైద్యం వికటించి వ్యక్తి మృతి.. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ధర్నా
X

దిశ, సిరిసిల్ల : కడుపు నొప్పితో ఓ ప్రయివేట్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళితే వైద్యం వికటించి ఆ వ్యక్తి మృతి చెందినట్లు మృతుని బంధువులు ఆరోపించారు. దీంతో గ్రామస్థులు మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కోనరావుపేట మండలం నిమ్మపెల్లి గ్రామానికి చెందిన చిలుక భీమయ్య (55) అనే వ్యక్తి సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లారు.

ఈ క్రమంలో పరిస్థితి చాలా విషమంగా ఉందని, వెంటనే స్కానింగ్ చేయాలని, స్కానింగ్ చేసిన తరువాత కడుపులో రంద్రం పడిందని వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని తెలిపారు. ఆపరేషన్ చేయడానికి ముందు డిపాజిట్ సైతం తీసుకున్నారని, ఆపరేషన్ చేసిన తరువాత ఒక కాలు పని చేయకుండా అయిందని ఆరోపించారు. శనివారం ఆపరేషన్ చేయగా, ఆదివారం రోజున బాగానే ఉన్నాడని, సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో వెళ్లి చూడగా మృతి చెందాడని తెలిపారు.

వెంటనే ఆసుపత్రి సిబ్బందికి వెళ్లి చెప్పగా, వారు పరీక్షలు చేసి మృతి చెందినట్లు తెలిపారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వైద్య సేవలు అందక భీమయ్య మృతి చెందినట్లు వారు తెలిపారు. కానీ, ఆసుపత్రి వర్గాలు మాత్రం గుండెపోటు వచ్చిందని, అందువల్లే మరణించాడని అంటున్నారన్నారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరం ఉండడంతో, పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. అనంతరం పట్టణ సీఐ ఉపేందర్ మృతుని బంధువులను, కుటుంబసభ్యులకు నచ్చ చెప్పి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story