నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం.. చెరువులో మునిగి నలుగురి మృతి

by Kalyani |   ( Updated:2023-04-18 15:22:36.0  )
నారాయణపేట జిల్లాలో తీవ్ర  విషాదం.. చెరువులో మునిగి నలుగురి మృతి
X

దిశ ప్రతినిధి, నారాయణపేట: చెరువులో మునిగి ముగ్గురు పిల్లలు, ఓ మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బోయినపల్లి గ్రామంలో జరిగింది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సురేఖ (28), మేకను మేపడానికి గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువు వద్దకు వెళ్లింది. ఆమె వెంట ఆమె కుమారుడు విజయ్ (8), అక్క కూతురు నిఖిత (11), దూడం నరసప్ప కుమారుడు వెంకటేష్ (8), మరో బాలిక వెళ్లింది.

సురేఖ మేక వద్ద ఉండగా పిల్లలు చెరువులోకి వెళ్లి ఈత కొట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు నీళ్లలో మునుగుతూ కేకలు వేశారు. పిల్లలు మునిగిపోతున్న దృశ్యాన్ని చూసిన సురేఖ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని కాపాడేందుకు చెరువులో దూకింది. కానీ ఆమె కూడా పిల్లలతో పాటు మునిగి మరణించింది. ఈ దృశ్యాలను చూసిన 12 ఏళ్ల బాలిక చేసేదేమీ లేక ఏడుస్తూ గ్రామంలోకి పరిగెత్తి జరిగిన సంఘటనను తెలియజేసింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకొని పరిశీలించగా నలుగురు అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకే రోజు నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. నారాయణపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story