భార్య ఆ పని చేసిందని తండ్రిని కొట్టి చంపిన కొడుకు

by sudharani |
భార్య ఆ పని చేసిందని తండ్రిని కొట్టి చంపిన కొడుకు
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కొంత మంది సర్దుకు పోతారు. మరి కొందరు వాటిని పెద్దవి చేసుకుని విడిపోతారు. ఇదిలా ఉంటే.. భార్యాభర్తల గొడవల మధ్య అనవసరంగా పిల్లలు, పెద్దలు ఒక్కోసారి బలవుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో జరిగింది. తన భార్య మీద ఉన్న కోపంతో కొడుకు తండ్రిని కొట్టాడు. దీంతో తండ్రి అక్కడికక్కడే మరణించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని పడమర పాతకోట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (50), రమణమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు.. ఓ కుమార్తె. పెద్ద కుమారుడు శ్రీకాంత్‌కు 6 ఏళ్ల క్రితం వివాహం అయింది. అతడికి ఇద్దరు సంతానం. పెళ్లైన కొంతకాలం బాగానే ఉన్న వారి సంసార జీవితంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ గొడవలు తట్టుకోలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అతడి తల్లిదండ్రులతో గొడవ పడ్డారు. తండ్రి కొడుకుల మధ్య మాటల యుద్ధం పెరిగింది.

దీంతో క్షణికావేశంలో కొడుకు తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టాడు. రక్తపు మడుగులో తండ్రి అక్కడికక్కడే మరణించాడు. అది గమనించిన తల్లి భర్త చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. తండ్రి చనిపోయాడన్న విషయం తెలుసుకున్న శ్రీకాంత్ పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Advertisement

Next Story