బెంగళూరు పోలీస్ కమిషనర్ to MLC కవిత.. సుఖేశ్ సక్సెస్ ‌ఫుల్ క్రైమ్ స్టోరీ!

by GSrikanth |   ( Updated:2023-04-21 09:27:12.0  )
బెంగళూరు పోలీస్ కమిషనర్ to MLC కవిత.. సుఖేశ్ సక్సెస్ ‌ఫుల్ క్రైమ్ స్టోరీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నయా నట్వర్​లాల్.. సుఖేశ్ చంద్రశేఖర్. సెలబ్రిటీలను బురిడీ కొట్టిస్తూ వేల కోట్లు దోచుకున్న సుఖేశ్​.. 1960, 70 దశకాల్లో తాజ్​మహల్, ఎర్రకోటను అమ్మిన నట్వర్​లాల్‌కి వారసుడిగా అవతరించాడు. దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడి బుట్టలో వేసుకోవడంలో ఘనుడిగా పేరొందాడు. అతడి 34 ఏళ్ల జీవితంలో సగం నేరాలతోనే గడిచిపోయింది. టీనేజీలో (17ఏళ్ల వయసు)నే ఏకంగా బెంగుళూరు పోలీస్​ కమిషనర్​ సంతకాన్ని ఫోర్జరీ చేసి సక్సెస్ అయ్యాడు. ఇటీవల ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కుమార్తె ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేసి ఫేమస్ అయ్యాడు. ఈ స్కామ్ కంటే ముందే కవితకు ఆమ్​ఆద్మీ పార్టీ పంపిన భారీగా డబ్బు చేరవేసినట్టు ప్రకటించడంతోపాటు ఆమె వాట్సాప్​చాటింగ్‌ను బహిర్గతం చేసి మరింత అగ్గిని రాజేశాడు. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీ కాన్​మాన్ సుఖేశ్​ గురించి ఈడీ, ఐటీ, ఢిల్లీ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు పలు సందర్భాల్లో వెల్లడించిన అంశాలతో ఈ వారం స్పెషల్ స్టోరీ.

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో జన్మించిన సుఖేశ్ అక్కడి బిషప్ కాటన్ బాయ్స్ హైస్కూల్‌‌లో సెకండరీ స్థాయి వరకు చదివాడు. అప్పట్లో లగ్జరీ కార్లలో వచ్చే తోటి విద్యార్థులను చూసి తానూ ఆ జీవితాన్ని అనుభవించాలని కోరుకున్నాడు. టెన్త్ క్లాస్ డ్రాపౌట్‌గా మిగిలిపోయాడు. మైనర్లకు డ్రైవింగ్ లైసెన్సు దొరకని రోజుల్లో (2006) బైక్, ఫోర్ వీలర్ నడపడానికి ప్రత్యేక పర్మిషన్ పొందినట్లు బెంగుళూరు నగర పోలీసు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫస్ట్ క్రైమ్‌ చేశాడు. ఆ సక్సెస్‌ ధీమాతో అప్పటి కర్ణాటక సీఎం కుమారస్వామి కొడుకునంటూ సుబ్రమణి అనే ఫ్యామిలీ ఫ్రెండ్‌ని మోసం చేశాడు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కస్టడీలో ఉన్న ప్లాట్‌కు క్లియరెన్స్ తెప్పిస్తానని రూ.కోటి కాజేశాడు. ఫస్ట్ టైమ్ బెంగుళూరు పోలీసులు 2007లో సుఖేశ్‌ను అరెస్టు చేశారు.

జైలు.. షరామామూలే

అరెస్టుకావడం, జైలుకు వెళ్లడం, బెయిల్‌తో బైటకు రావడం సుఖేశ్ రొటీన్ ప్రాక్టీసు. 2009లో బెయిల్‌పై విడుదలై బైటకురాగానే కర్ణాటక గవర్నమెంట్‌లో ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ చెన్నైలోని ఫ్యూచర్ టెక్నిక్స్ అనే కంపెనీ యజమానిని మోసం చేశాడు. ఆ కంపెనీకి కర్ణాటక స్టేట్ నుంచి రూ. 132 కోట్ల కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మించాడు. కంపెనీ తరఫున నాప్‌కిన్ తయారీ మెషీన్ల కోసం కెనరాబ్యాంకు నుంచి రూ. 19 కోట్ల లోన్ పొందాడు. చివరకు ఆ మోసం బైటపడడంతో సుఖేశ్‌ను కోల్‌కతాలో, భార్య సినీ నటి లీనా మారియాపాల్​ (మద్రాస్​ కేఫ్​ ఫేమ్​)ను ఢిల్లీలో పోలీసులు 2013లో అరెస్టు చేశారు. అరెస్టు చేసే సమయానికే భార్యాభర్తలిద్దరూ కలిసి రూ. 12 కోట్లు ఖర్చు చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల ఎన్నికల గుర్తును ఇప్పిస్తానని శశికళతో, ఆమె మేనల్లుడు టీటీవీ దినకర్‌తో రూ. 50 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడు. కేంద్ర ఎలక్షన్ కమిషన్‌తో పని పూర్తి చేయిస్తానని నమ్మించాడు. 2017లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి బెంజ్ కారులో ఉన్న కోటిన్నర రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఫోర్టీస్ హెల్త్ కేర్ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ ఒక ఫ్రాడ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉంటే ఆ కేసులను మాఫీ చేయించి విడిపిస్తానని కేంద్ర లా మినిస్ట్రీ అధికారిగా నమ్మించి ఆయన భార్య అదితిసింగ్‌ నుంచి రూ. 200 కోట్లు తీసుకున్నాడు. ఢిల్లీలోని రోహిణి జైల్లో ఉన్నా సుఖేశ్ తన చీటింగ్ యాక్టివిటీస్‌ను విడిచిపెట్టలేదు. నెలకు రూ.కోటిన్నర చొప్పున జైలు సిబ్బందికి ముడుపులు ఇచ్చి బ్యారక్‌లో లగ్జరీ సౌకర్యాలు, మొబైల్ ఫోన్‌లో మాట్లాడుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. దాదాపు ఏడాది పాటు జరిగిన ఈ వ్యవహారం బైటకు పొక్కడంతో ఎనిమిది మంది జైలు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.

లగ్జరీ కార్లు, విలాసవంతమైన జీవితం

టీనేజ్ వయసులోనే నేరాలు మొదలుపెట్టిన సుఖేశ్ చెన్నై నగరంలోని ఈస్ట్ కోస్టు రోడ్డులో విలాసవంతమైన విల్లాను కొనేశాడు. మొత్తం 17 సంవత్సరాల నేర జీవితంలో సుమారు రూ.రెండు వేల కోట్లకు పైగానే సొమ్మును పోగుచేసుకున్నట్లు అంచనా. కర్ణాటకలో రూ. 50 కోట్ల లంచం కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 2017 నవంబర్​లో సుఖేశ్‌ ఆస్తులపై సోదాలు నిర్వహించే సమయానికే లగ్జరీ కార్లు, విలాసవంతమైన జీవితాన్ని చూసి విస్తుపోయారు. లాంబోర్గిని, పోష్ కేయిన్, బెంట్లీ, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, జాగ్వార్, టొయోటా లాండ్ క్రూయిజర్ లాంటి ఎనిమిది కార్లు, డుకాటీ బైక్‌ను సీజ్ చేశారు. ఐటీ సోదాల తర్వాత ఈడీ అధికారులు కూడా ఈస్ట్ కోస్ట్ రోడ్డు విల్లాలో తనిఖీలు చేశారు. భవనంలోని ఇంటీరియర్ డిజైనింగ్ కోసం చేసిన ఖర్చును లెక్కించలేమని, ఇప్పటివరకు ఇంతటి ఖరీదైన వస్తువులను చూడలేదని ఈడీ అధికారి అప్పట్లో కామెంట్ చేయడం గమనార్హం. ఇంటి లోపలే సుఖేశ్ తనకు ఇష్టమైన మెర్సిడెజ్ బెంజ్ ఎస్ఎల్ఆర్ 300 మోడల్ కారుకు 722 అనే నెంబర్‌తో ఎంగ్రేవింగ్ చేయించుకున్నారని, రాగితో తయారుచేసిన గుర్రపు తల విగ్రహం.. ఇవన్నీ సుఖేశ్ లగ్జరీ జీవితానికి నిదర్శనమన్నారు.

అందరూ చుట్టాలే..

చీటింగ్ కోసం సుఖేశ్ వాడని రిలేషన్ లేదు. కరుణానిధి మనుమడిగా.. డీఎంకే నేత అళగిరి అల్లుడిగా, ఆ పార్టీకి చెందిన టీఆర్ బాలు కొడుకుగా, ఆ పార్టీ కోశాధికారి అన్బళగన్ కొడుకుగా, కర్ణాటక మాజీ సీఎం యెడ్యూరప్ప సెక్రటరీగా, మంత్రి కరుణాకర్‌రెడ్డి కొడుకుగా, కర్ణాటక మాజీ సీఎస్ సుధాకర్ రావు కొడుకుగా, ఏపీ మాజీ సీఎం వైఎస్సార్ మేనల్లుడిగా, ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యదర్శిగా, కేంద్ర హోంశాఖ సెక్రటరీగా, కేంద్ర లా మినిస్ట్రీలో ఐఏఎస్ ఆఫీసర్‌‌గా, కర్ణాటక గవర్నమెంటులో ఐఏఎస్ అధికారిగా.. ఇలా ఒక్కో మోసానికి ఒక్కో బంధుత్వాన్ని ఆపాదించుకున్నాడు.

టెక్నాలజీపై స్పెషల్ స్కిల్

చీటింగ్ కార్యకలాపాలకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకున్నాడు. ఏ వ్యాపారిని టార్గెట్ చేయాలనుకున్నాడో వారితో నేరుగా సంప్రదింపులు జరపడు. తొలుత ఈ-మెయిల్ ద్వారా మెసేజ్ పంపుతాడు. ఆ తర్వాత రిప్లై రాగానే మొబైల్ ఫోన్ నుంచి కాల్ చేస్తాడు. కానీ అవతలి వ్యక్తికి అది లాండ్‌లైన్ నంబర్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా స్పూఫింగ్ అప్లికేషన్‌ను వాడుతాడు. శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్‌, ఐ-ఫోన్ 12 ప్రో మ్యాక్స్ వాడుతున్నట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. కానీ అందులో వాడే సిమ్ కార్డు నంబర్లన్నీ ఇజ్రాయిల్ దేశానికి చెందినవని తెలిపారు. ఫలానా వ్యక్తిగా పరిచయం చేసుకోవాలని భావిస్తే ట్రూకాలర్ యాప్‌లో అది డిస్‌ప్లే అయ్యేలా చూసుకుంటాడు. ఇక దోచుకున్న సొమ్ము ఒక్కోసారి ఒక్కో బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స ఫర్ అవుతాయి. ఆ డబ్బు చేర్చేందుకు తన మనుషులకు నెలకు సగటున రూ.కోటి జీతంగా ఇస్తున్నట్లు పోలీసు వర్గాల అభిప్రాయం. పోలీసు డిపార్టుమెంటులోనూ కొద్దిమందికి శాలరీ తరహా నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ప్రస్తుత పేరు: సుఖేశ్ చంద్రశేఖర్

ఇతర పేర్లు: శేఖర్ రెడ్డి, బాలాజీ

తల్లిదండ్రులు: మాయా, విజయన్ చంద్రశేఖర్

జననం: 1989.. బెంగళూరు (కర్ణాటక)

విద్యాభ్యాసం: బెంగళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ హైస్కూల్; మదురై యూనివర్శిటీలో డిగ్రీ

తెలిసిన భాషలు: తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్​

భార్య: లీనా మరియపాల్‌ (సినీ నటి)

గర్ల్ ఫ్రెండ్స్: జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి

Advertisement

Next Story