మొన్న భార్య, నేడు భర్త ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

by sudharani |   ( Updated:2022-09-09 05:42:20.0  )
మొన్న భార్య, నేడు భర్త ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకే సామాజిక వర్గం, దగ్గరి బంధువులు అయినప్పటికీ వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. రెండున్నర ఏళ్ల క్రితం కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. రెండు రోజుల క్రితం భార్య మృతిచెందడంతో.. గురువారం భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మంగళూరులో బీటెక్ చదువుతున్న గగనశ్రీ(24), కళ్యాణదుర్గం శంకరప్ప తోట కాలనీకి చెందిన గణేష్ (25) రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు ఇరువురు బంధువులు అయినప్పటికీ గగనశ్రీ ఇంట్లో వాళ్లకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో గగనశ్రీ కొన్నాళ్లు మంగళూరులోనే ఉండిపోయింది. గణేష్ మాత్రం స్వగ్రామానికి వస్తుండేవాడు. తల్లిదండ్రులకు తెలియకుండా ఐదు నెలల క్రితం భర్తతో పాటు కళ్యాణ్‌ దుర్గం వచ్చి అక్కడే ఉంది. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన జ్వరంతో కళ్యాణ దుర్గం పట్టణం, అనంతపురంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో వైద్యం చేయించుకోగా డెంగ్యూగా నిర్ధారణ అయ్యింది. దీంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళతుండగా మార్గ మధ్యలో మృతి చెందింది.

అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి కాగా.. తన కుమార్తెను భర్త, అత్తమామలే చంపేశారని గగనశ్రీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం తహసీల్దారు, పోలీసులు విచారణ చేపట్టి గగనశ్రీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తల్లిదండ్రులే వారి స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తానే భార్యను చంపానంటూ కేసు నమోదు చేశారని, ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఆకరి చూపు కూడా చూడలేదన్న మనస్తాపంతో గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు గణేష్. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతిని తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్ల తెలిపారు.

Advertisement

Next Story