కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి అరెస్ట్

by Shiva |
కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి అరెస్ట్
X

కొడుకు తాగేందుకు డబ్బు ఇవ్వలేదనే కోపంతో హత్య

దిశ, మంథని : మండల పరిధిలోని బట్టుపల్లిలో ఈనెల 11న కన్న కూతురిని గొడ్డలితో నరికి చంపి మరో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో గుడ్ల సదయ్య (35) అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు మంథని సీఐ గడిగొప్పుల సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా మంథని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సతీష్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన నిందితుడు సదయ్య మద్యానికి బానిసై గతంలో భార్యను చంపి తాజాగా గురువారం రోజున కన్న కూతురు ఐదో తరగతి చదువుతున్న రజితను గొడ్డలితో నరికి చంపాడు.

భార్య చనిపోయిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడు కొడుకు అంజి, కూతురు రజితతో కలిసి ఉంటున్నాడు. కొడుకు అంజి కూలి పనికి వెళుతున్నా.. తనకు వచ్చిన డబ్బు తాగడానికి ఇవ్వాలని నిందితుడు సదయ్య రోజు గొడవకు దిగేవాడు. గ్రామంలో కూడా తరచు అందరితోనూ గొడవలు పెట్టుకునేవాడు. తాగడానికి కొడుకు డబ్బు ఇవ్వడం లేదనే కోపంతో కన్న కూతురిని నిర్దాక్షిన్యంగా నరికి చంపాడు. కూతురిని నరికి చంపాక అదే గ్రామానికి చెందిన ధూపం శ్రీనివాస్ అనే వ్యక్తిపై కూడా దాడికి తెగబడ్డాడు.

శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి నేర పరిశోధనలో చాకచక్యంగా వ్యవహరించిన మంథని, రామగిరి ఎస్సైలు వెంకటేశ్వర్లు, రవి ప్రసాద్, ఏఎస్సై మల్లయ్య, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుళ్లు సురేందర్, కిరణ్, సురేష్, హోంగార్డ్స్ మురళి, శ్రీహరిలను మంథని సీఐ సతీష్ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story