రెడ్డిపాలెంలో కలకలం... ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి

by Mahesh |
రెడ్డిపాలెంలో కలకలం... ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి
X

దిశ, హనుమకొండ టౌన్: వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం రెడ్డిపాలెంలో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. గ్రామానికి చెందిన వ్యాపారి కొలకుల కొండారెడ్డి(45) మృతి పలు అనుమానాలకు దారి తీసింది. కొండారెడ్డికి వ్యాపారంలో వచ్చిన నష్టాలతో రెండేళ్లుగా మద్యానికి బానిస అయ్యారు. కూతురును అమెరికా పంపించిన కొండారెడ్డి రెడ్డిపాలెంకు రాగా భార్య జ్యోస్విన తల్లిగారింటికి వెళ్లింది. రెడ్డిపాలెం కు వచ్చిన కొండారెడ్డి మద్యానికి బానిస అయ్యాడు. ఈనెల 10వ తేదీన కొండారెడ్డి తో చెల్లి నిర్మల మేరి, కూతురు ప్రవళ్లికలు మాట్లాడారు. 12న నిర్మలమేరి ఫోన్‌ చేయగా ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఆమె సమీపంలో ఉన్న నక్షత్రమ్మకు, కొమ్మరెడ్డి మహర్షిలకు సమాచారం అందించారు.

వారు ఇంటికి వెళ్లి తలుపులు కొట్టినా తీయక పోవడంతో డోర్‌ పైబాగాన ఉన్న కిటికి పగులగొట్టి బోల్ట్‌ తీసి తలుపులు తెరిచారు. కొండారెడ్డి రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. దీంతో మహర్షి ఈ విషయం కొండారెడ్డి భార్యకు తెలిపారు. అమె సోమవారం ఉదయం రెడ్డిపాలెంకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎనుమాముల ఇన్స్‌పెక్టర్‌ చేరాలు, ఎస్ఐ పోగుల శ్రీకాంత్‌ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. వంట గదిలో మద్యం తాగిన గ్లాసు, పురుగుల మందు డబ్బా, మద్యం సీసా లభించాయి. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story