బాలికని కిడ్నాప్ చేసిన వ్యభిచార ముఠా అరెస్ట్

by Sridhar Babu |
బాలికని కిడ్నాప్ చేసిన వ్యభిచార ముఠా అరెస్ట్
X

దిశ, హనుమకొండ : వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. మంగళవారం నిందితులను అరెస్టు చేశారు. ఈనెల 11న మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ బాలిక మిస్సింగ్ అయిందని ఫిర్యాదు రాగా దర్యాప్తు చేపట్టారు. బాలికని ములుగు క్లాస్ రోడ్డు వద్ద గుర్తించారు. ఆమెని విచారించగా తనని కొంతమంది కిడ్నాప్ చేసి గంజాయి తాగించి అత్యాచారం చేసినట్లుగా తెలిపింది. దాంతో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్, సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో వరంగల్ ఏసీపీ పర్యవేక్షణలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించి వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు దామెర మండలం ల్యాదేళ్ల గ్రామానికి చెందిన ఓ మహిళగా గుర్తించారు. ఈ మహిళ పడుపు వృతి చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకి పరిచయం ఉన్న మైనర్ నిందితురాలు తల్లిదండ్రులు మరణించడంతో తన ఇంట్లోనే ఉంచుకునేది. ఈ క్రమంలో ఎవరైనా కొత్త బాలికలు, మైనర్లయితే ఎక్కువ డబ్బులు కస్టమర్ దగ్గర నుండి వసూలు చేయొచ్చని పథకం వేసింది.

ఈ క్రమంలో తన వద్ద ఉన్న మైనర్ నిందితురాలితో బాలికలను ట్రాప్​ చేయించేది. ఇందులో భాగంగా బాధితురాలితో పరిచయం పెంచుకొని స్కూల్ కి వెళ్లే సమయంలో మైనర్​ నిందితురాలు శంభునిపేట్ కి చెందిన తన లవర్ అబ్దుల్ అఫ్నాన్ సహాయంతో మద్యం, గంజాయి తాగడం అలవాటు చేసింది. అనంతరం షాపింగ్ చేయించి బట్టలు కొనిచ్చారు. బాధితురాలు వారిని పూర్తిగా నమ్మిన తరువాత ఈనెల 11వ తేదీ సాయంత్రం ఇంటి నుండి బయటకు రప్పించి అబ్దుల్ అఫ్సాన్, అతని స్నేహితులైన షేక్ శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్ కలిసి కారులో తీసుకెళ్లారు. వారికి తరుచూ గంజాయి విక్రయించే మీర్జా పైజ్ బేగ్ (ఐదూద్ ) వద్ద గంజాయి కొనుగోలు చేసి నర్సంపేట దగ్గరలోని పాడుబడిన షేక్ సైలానిబాబా ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలికి గంజాయి తాగించి ఆమె మత్తులోకి వెళ్లగానే సైలాని బాబా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నీవు గంజాయి తాగుతుండగా, వ్యభిచారం చేస్తుండగా వీడియో తీశామని, రేపటి నుండి తాము చెప్పినట్లు చేయాలని,

ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో బయట పెడతామని బెదిరించారు. అనంతరం ఆమెని ములుగు క్రాస్ రోడ్డు వద్ద దించారు. నిందితులు అప్పటి నుండి పరారీలో ఉన్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈరోజు ఉదయం నిందితులు అందరినీ అరెస్ట్ చేశారు. విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించారు. అలాగే నిందితుడైన మీర్జా ఫైజ్ బేగ్ ( వదూద్ ) వద్ద నుండి 1.8 కేజీల గంజాయిని కూడా సీజ్ చేశారు. ప్రధాన నిందితురాలి ఇంటి వద్ద 4300 కండోమ్ పాకెట్స్ తో పాటు రూ.75 వేల నగదు, ఒక కారు, నాలుగు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకి గతంలో కూడా నేరచరిత్ర ఉన్నట్టుగా విచారణలో వెల్లడైంది. నేరస్తులపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసుని ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన వరంగల్ ఏసీపీ నందిరామ్, మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం, మిల్స్ కాలనీ ఎస్ఐ లు శ్రీకాంత్, సురేష్ లను సీపీ అభినందించారు.

Next Story