పేర్లు బయటకొస్తున్నాయ్..చౌదరి విచారణలో కీలక వివరాలు

by Javid Pasha |
పేర్లు బయటకొస్తున్నాయ్..చౌదరి విచారణలో కీలక వివరాలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కొకైన్ అమ్ముతూ అరెస్ట్ అయిన కబాలీ నిర్మాత కే.వీ. చౌదరి పోలీస్ కస్టడీలో కీలక వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. గత నెలలో గోవాలో తాను ఇచ్చిన డ్రగ్ పార్టీకి టాలీవుడ్ కు చెందిన కొంతమందితోపాటు సంపన్న కుటుంబాలకు చెందిన పలువురు వచ్చినట్టుగా దర్యాప్తు అధికారులతో చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీస్ అధికారులు వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని భావిస్తున్నట్టు తెలియవచ్చింది. కబాలీ తెలుగు వర్షన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన చౌదరి ఇటీవల కిస్మాత్ పురా చౌరస్తా వద్ద కొకైన్ అమ్ముతుండగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అతని నుంచి డ్రగ్స్ కొన్నవారిలో టాలీవుడ్ సెలెబ్రేటీలు, ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్టుగా ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ క్రమంలో అతని నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, చౌదరిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేసారు. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు. ఇందులో చౌదరి తన నుంచి కొకైన్ కొన్న కొందరి పేర్లు చెప్పినట్టు సమాచారం. వీరికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించటానికి అధికారులు నిర్ణయించారు.

Advertisement

Next Story