అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ఆటకట్టు..8 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్

by Aamani |
అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ఆటకట్టు..8 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్
X

దిశ,పటాన్ చెరు : అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ఆటకట్టించారు పటాన్ చెరు పోలీసులు. గత 8 ఏండ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల పరిధిలో గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ మల్లేష్ జాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం పటాన్ చెరు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి వివరాలను వెల్లడించారు.

కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా బాల్కీ తండాకు చెందిన మల్లేష్ జాదవ్ (26) హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో టిఫిన్ సెంటర్ లో పనిచేస్తూ..ప్రవృత్తిగా గంజాయి సరఫరా చేస్తూ, అంతర్రాష్ట్ర స్మగ్లర్ గా ఎదిగాడు.2019 సంవత్సరంలో బాల్కీ లో డిగ్రీ చదువుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. స్థానికంగా పరిచయమున్న యువకులతో కలిసి కారు డ్రైవర్ గా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు నుంచి గంజాయి సేకరించి మహారాష్ట్రలోని గంజాయి స్మగ్లర్ దాదా పాటీలకు సరఫరా చేసేవారు. తదనంతరం తనే సొంతంగా గ్రూపును తయారు చేసుకుని గంజాయి స్మగ్లింగ్ ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒరిస్సా రాష్ట్ర పరిధిలోని మల్కనగిరి జిల్లా నుంచి గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో విక్రయించడం ప్రారంభించాడు. సరఫరా చేసిన ప్రతిసారి లక్షల్లో ఆదాయం వస్తుండడంతో దీనిని వృత్తిగా మార్చుకున్నాడు.

గంజాయి సరఫరాలో సంపాదించిన సొమ్ముతో సొంత గ్రామమైన బాల్కీ తండాలో భూములు కొనుగోలు చేసి సొంత ఇల్లు సైతం కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంత కారులో 50 కిలోల గంజాయి తీసుకొని కోహిర్ మండలం మనియార్పల్లి చెందిన వ్యక్తికి అందజేసేందుకు వెళ్తున్న క్రమంలో గురువారం మధ్యాహ్నం పటాన్ చెరు మండలం కర్థనూరు గ్రామ శివారులోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ సిఐ స్వామి గౌడ్ వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. పూర్తి విచారణ అనంతరం నిందితుడి నుంచి..రెండు సార్లు, ఒక ద్వి చక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు స్వామి గౌడ్, ప్రవీణ్ రెడ్డి, ఎస్సైలు భరత్ భూషణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story