‘టు లెట్’ బోర్డు ఉన్న ఇళ్లే టార్గెట్.. అద్దెకు ఇల్లు కావాలని వెళ్లి చోరిలు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-24 16:47:10.0  )
‘టు లెట్’ బోర్డు ఉన్న ఇళ్లే టార్గెట్.. అద్దెకు ఇల్లు కావాలని వెళ్లి చోరిలు
X

దిశ,పల్నాడు: సత్తెనపల్లిలో వృద్ధ దంపతులపై దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు డి.ఎస్.పి ఎం. హనుమంతరావు విలేకరులకు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం, గ్రామానికి చెందిన సత్తి గవన కుమార్ రెడ్డి గత కొంతకాలంగా పట్టణంలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన ఎన్నికల్లో 20 లక్షల రూపాయలకు బెట్టింగులు పెట్టటం, వడ్డీ వ్యాపారంలో మరో 20 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది. పోయిన సొమ్మును రాబట్టుకునేందుకు పన్నాగం పన్నారు. తను ఎంచుకున్న మార్గాన్ని సమీప స్నేహితులైన సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామానికి చెందిన మర్రి అమ్మయ్య, ఎర్ర సాని నానితో చెప్పాడు. వ్యూహాత్మకంగా ఈ ముగ్గురు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో "టులెట్ బోర్డు" పెట్టి ఉన్న తూనుగుంట సీతారామయ్య ఇంట్లోకి ఈనెల 22వ తేదీ ఉదయం ప్రవేశించారు.

తమకు అద్దెకు ఇల్లు కావాలని కోరారు. ఇల్లు చూపిస్తున్న క్రమంలో వృద్ధ దంపతులు పై వారు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా తమకు నగదు కావాలని, లేదా బంగారు వస్తువులైన సరే ఇవ్వాల్సిందేనని ఆ వృద్ధ దంపతులను బెదిరించి, దాడి చేసి, భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో వారు కేకలు వేయడంతో తమ వెంట తీసుకు వచ్చిన బైకును అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితుడు సీతారామయ్య ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా గురువారం నిందితులు సత్తి గవన కుమార్ రెడ్డి, మర్రి అప్పయ్యలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ వివరించారు. మూడో ముద్దాయి అయినా ఎర్రసాని నాని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 48 గంటల్లో చాకచక్యంగా నిందితులను పట్టుకున్న సత్తెనపల్లి పట్టణ సీఐ బ్రహ్మయ్య, ఇద్దరు ఎస్ఐలు ఎం.సంధ్య, పవన్,ఏ ఎస్ ఐ పి.సుబ్బారావు, నర్రా శంకర్ సిబ్బందిని డీఎస్పీ ఎమ్.హనుమంతురావు అభినందించారు. అంతేకాకుండా వీరికి పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు చేతుల మీదుగా రివార్డ్ లు ఇవ్వనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed