Fraud : డబుల్​ బెడ్​ రూం ఇండ్ల పేరుతో మోసం

by Sridhar Babu |
Fraud : డబుల్​ బెడ్​ రూం ఇండ్ల పేరుతో మోసం
X

దిశ, కూకట్​పల్లి : డబుల్​ బెడ్​ రూం ఇండ్లు (Double bedroom houses)ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి ఓ వ్యక్తి పరారయ్యాడు. డబ్బులు ఇచ్చి మోస పోయిన బాధితులు మంగళారం కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 15 మంది నుంచి సుమారు రూ.75 లక్షల (Rs.75 lakhs)వరకు వసూలు చేసిన వ్యక్తి కనిపించడం లేదని బాధితులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్​బీ కాలనీ మూడవ ఫేజ్​ ఎంఐజీ 33/4కు చెందిన నడింపల్లి సుజాత (40) 6వ ఫేజ్​లో టైలర్​గా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది.

అదే కాలనీలో నివాసం ఉంటున్న దుడ్డు రామలక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రామలక్ష్మి తనకు తెలిసిన వేణు గోపాల్​ దాస్​ (Venu Gopal Das)అనే వ్యక్తి గండిమైసమ్మ వద్ద నిర్మించిన డబుల్​ బెడ్​ రూం ఇండ్లను విక్రయిస్తున్నాడని చెప్పింది. చాలా మంది 2.5 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని, వారు అలాట్​మెంట్​ లెటర్​లు, తాళాలు అందుకున్నారని సుజాతతో చెప్పింది. రామలక్ష్మి చెప్పిన మాటలు విన్న సుజాత ఎలాగైనా డబుల్​ బెడ్​ రూం ఇంటిని కొనుగోలు చేయాలని ఈ ఏడాది మే 11వ తేదీన దుడ్డు రామలక్ష్మి నుంచి వేణు గోపాల్​ దాస్​కు సంబంధించిన మొబైల్​ నంబర్​లు (8977248654, 8125079978) తీసుకుని ఆయనకు ఫోన్​పే ద్వారా తన సోదరుడి ఫోన్​ నుంచి 35 వేల రూపాయలు చెల్లించింది.

తరువాత కొన్ని రోజులకు 1.90 లక్షల రూపాయలు నగదు రూపంలో వేణు గోపాల్​ దాస్​కు ఇవ్వమని దుడ్డు రామలక్ష్మి ద్వారా ఇచ్చింది. ఎన్నికల తరువాత డబుల్​ బెడ్​ రూం ఇండ్లు ఆన్​లైన్​ ద్వారా అలాట్​మెంట్​ లెటర్ వస్తుందని, తాళాలు ఇస్తానని వేణు గోపాల్​ దాస్​ నమ్మించాడు. ఎన్నికల తరువాత రామలక్ష్మితో పాటు సుజాత వేణు గోపాల్​ దాస్​ను కలిసేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాక పోవడంతో ఆయన గురించి గాలించడం ప్రారంభించారు. వేణు గోపాల్​ దాస్​ సుజాతతో పాటు నాగ శిరోమణి, సుబ్బలక్ష్మి, ఈశ్వరి, నాగమణితో పాటు మరి కొంత మంది నుంచి కూడా డబ్బులు తీసుకుని పరారైనట్టు తెలుసుకున్నారు. దీంతో బాధితులు మంగళవారం కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటేశ్వర్​ రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed