యూ ట్యూబ్ లో చూసి ఫేక్ కరెన్సీ తయారి..

by Sumithra |
యూ ట్యూబ్ లో చూసి ఫేక్ కరెన్సీ తయారి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మళ్ళీ దొంగ నోట్ల కలకలం రేగింది. పోలీసు శాఖ చాకచక్యంగా వ్యవహరించడంతో ఐదుగురు ఫేక్ కరెన్సీ తయారు చేసి చెలామణి చేస్తున్న వారిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వివరాలను వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి టేక్రియాల్ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తవేరా ఏపీ 09 బీఏ 8339 నంబరు గల వాహనంలో ఉమర్, ఒబైద్ అనే వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని, వారిని వెంబడించి పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు.

మతిన్, హుసేన్, మొయిజ్ లతో కలిసి వాహనంలో దొంగనోట్లను తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసిన అనంతరం రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మతిన్, హుసేన్, మొయిజ్ లను తీసుకుని బైంసా వెళ్లగా వారు ఉంటున్న చోట దొంగ నోట్లు, 2 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీరివద్ద మొత్తం 330 నకిలీ 500 నోట్లు (1,65,000) స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు.

మొయిజ్ వద్ద డెడ్ ల్యాప్ టాప్, టీవీ కీ బోర్డు, ల్యామినేషన్ మిషన్, కెనాన్ కలర్ ప్రింటర్, కెనాన్ ప్రింటర్, డీటీపీ ప్రింటర్, స్ప్రే పెయింట్స్, టిన్నర్, గ్రీన్ కోటింగ్ పెయింట్, గ్లాస్ స్టాండ్, స్క్రీనింగ్ ప్రింటర్ ఇంక్స్, టు సైడ్ ప్లాస్టర్, ఏవీపీ గోల్డ్ పాలిష్ కలర్, బొరిక్ యాసిడ్, ఖాళీ కాట్రేజ్, బ్రౌన్ టిప్, కార్టెజ్(07), ఏక్సిక్యూటివ్ బాండ్ పేపర్స్, మింక్ గ్రీన్ రియాక్టివ్ ఫాయిల్, ఐరన్ స్కేల్, హెచ్ పి మౌజ్, ప్లాస్టిక్ స్కేల్, పేపర్ కటింగ్ బ్లేడ్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూట్యూబ్ లో నకిలీ నోట్లను తయారు చేయడం చూసి సాంకేతిక పరిజ్ఞానంతో దొంగనోట్లను తయారు చేసి చెలామణి చేస్తున్నారు. దొంగ నోట్ల తయారీలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మహ్మద్ ఉమార్, నిజామాబాద్ నగరంలోని నాగారంకు చెందిన ఓమైద్ ఖాన్, నిర్మల్ జిల్లా భైంసా పూలేనగర్ కు చెందిన షేక్ హుస్సెన్, భైంసాలోని మదీనా కాలీనకి చెందిన మతిన్ ఖాన్, పందిరి పల్లికి చెందిన అబ్దుల్ మోయిజ్ లు ఉన్నారని ఎస్పీ తెలిపారు.

ఇందులో ఉమర్, ఒబైద్ లు దొంగ నోట్లను చలామణి చేస్తారని, షేక్ హుసేన్, మతిన్ ఖాన్ నకిలీ కరెన్సీ తయారు చేస్తారని, మతిన్ ఖాన్ సాంకేతిక నిపుణిగా ఉంటాడని, అబ్దుల్ మొయిజ్ దొంగనోట్ల తయారీకి అవసరమయ్యే పరికరాలను తన ఇంట్లో దొంగ చాటుగా నిలువ చేస్తాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. దొంగ నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసు శాఖకు అందించాలని ఎస్పీ కోరారు.

Advertisement

Next Story