విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా...రైతు మృతి

by Sridhar Babu |
విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా...రైతు మృతి
X

దిశ, జడ్చర్ల : వ్యవసాయ పొలాల వద్ద ట్రాన్స్​ఫార్మర్ నిర్మించేందుకు కావాల్సిన విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్ పై తీసుకువెళ్తుండగా ట్రాలీ బోల్తాపడి ఒక రైతు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జడ్చర్ల మండలం గంగాపూర్ శివార్లో గల 167 వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. జడ్చర్ల మండల పరిధిలోని చిన్నాదిరాల గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ నిర్మించేందుకు విద్యుత్ శాఖ అధికారులకు డీడీలు చెల్లించారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభాలను తీసుకెళ్లడానికి ట్రాక్టర్ తీసుకురావాలని విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్ సూచించారు. దీంతో వారు గ్రామానికి చెందిన ట్రాక్టర్ తీసుకొని విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి ట్రాక్టర్​లో 11 స్తంభాలను ఎక్కించి గ్రామానికి బయలుదేరారు.

ఈ సమయంలో ట్రాక్టర్​ చిన్నదిరాల గ్రామానికి చెందిన రైతులు పబ్బతి జంగయ్య (60), ఎద్దుల జంగయ్య (54) ట్రాక్టర్ ట్రాలీలో కూర్చున్నారు. ఈ క్రమంలో గంగాపూర్ శివారులోకి చేరుకోగానే అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీ కింద పడింది. ఈ క్రమంలో స్తంభాలు రైతులపై పడడంతో పబ్బంతి జంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, జంగయ్యకు తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జంగయ్య మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన జంగయ్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా ప్రమాదానికి విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. నిజానికి విద్యుత్ అధికారులే స్తంభాలను రైతుల పొలాల వద్దకు చేర్చాలని అన్నదాతలు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed