చెంచులక్ష్మి దొంగల ముఠా అరెస్ట్.. వివరాలు వెల్లడించిన ఎస్పీ

by Kalyani |
చెంచులక్ష్మి దొంగల ముఠా అరెస్ట్.. వివరాలు వెల్లడించిన ఎస్పీ
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: కొన్ని వారాలుగా మహబూబ్ నగర్ పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చెంచులక్ష్మి దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 70 గ్రాముల బంగారం, 731 గ్రాముల వెండి, రెండు చేతి గడియారాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మిలటరీ కాలనీలో నివాసం ఉంటున్న చెంచులక్ష్మి అలియాస్ గడ్డం లక్ష్మి పలు రాష్ట్రాలలో దొంగతనాలకు పాల్పడేది. ఆమెపై 100కు పైగా ఆయా పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కావడంతో పాటు, ఒకసారి పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు అయింది.

గత డిసెంబర్ నెలలో హైదరాబాద్ అంబర్ పేటలో దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్ళింది. మార్చి నెలలో విడుదలై మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించింది. తన ఇంటికి సమీపంలోనే ఉంటున్న ఎరుకలి పద్మ అలియాస్ నగ్మా, ఎరుకలి మరియ, ఎరుకలి రేణుక తదితరులతో కలిసి తిరిగి దొంగతనాలు చేయడం మొదలు పెట్టింది. మధ్యాహ్నం సమయంలో తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించి ఇద్దరిని బయట కాపలా ఉంచి చెంచులక్ష్మి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సొమ్మును దోచేది. దొరికిన సొమ్మును అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు.

ఈ క్రమంలో మహబూబ్ నగర్ పట్టణం, రూరల్ ఏరియాలలో వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో డీఎస్పీ మహేష్, సిసిఎస్ ఇన్ స్పెక్టర్ ఇప్పే కార్, రూరల్ సీఐ రాజేశ్వర్ గౌడ్, ఫింగర్ ప్రింట్స్ ఇన్ స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఎస్సై శ్రీనివాసులు, తదితర సిబ్బంది నిఘా పెట్టి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ అయిన వారి నుంచి 70 గ్రాముల బంగారు, 731 గ్రాముల వెండి, రెండు చేతి గడియారాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

మరో సంఘటనలో..

భూత్పూర్ మండలంలో జరిగిన దొంగతనాల కేసులు కూడా ఛేదించడం జరిగిందని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. కొబ్బరి బొండాల వ్యాపారం చేసే ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామానికి చెందిన కొండపురి రామకృష్ణ వ్యాపారంలో నష్టం రావడంతో దొంగతనాలు మొదలుపెట్టాడు. ఇతను మధ్యాహ్నం తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించి రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడేవాడు.

అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండగా భూత్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. . అతడి నుంచి 10.4 తులాల బంగారం, రూ. 5000 ల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ దొంగను అదుపులోకి తీసుకొని కేసులు ఛేదించడంలో ప్రధాన పాత్ర పోషించిన సీఐ రజిత రెడ్డి, ఎస్సై భాస్కర్ రెడ్డి, ఫింగర్ ప్రింట్స్ కానిస్టేబుల్ నిరంజన్ ను ఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story