ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు

by Jakkula Mamatha |
ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై ఆత్మహత్య చేసుకుంటున్న యువకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఆన్‌లైన్ బెట్టింగ్ కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చింది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బెట్టింగ్‌ల వల్ల రూ.24 లక్షలు పోగొట్టుకోవడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంబళ్లపల్లె మండలంలోని దిగువగాలిగుట్టకు చెందిన పద్మనాభరెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు వేసి రూ.24 లక్షలు పోగొట్టుకున్నాడు.

రూ.24 లక్షలు పోగొట్టుకున్న బాధలో అమ్మమ్మ ఇంటికి వెళ్లడానికి బయలు దేరాడు. కానీ ఇంటికి వెళ్లకుండా మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చనిపోతున్నానో అని తెలుపుతూ ఓ లేఖ రాసి మధ్యలో రైలు కిందపడి చనిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని ఆత్మహత్య లేఖ, గుర్తింపు కార్డు, ల్యాప్‌టాప్, ఫోన్‌ ఆధారంగా పద్మనాభరెడ్డిగా గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed