కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య..

by Kalyani |   ( Updated:2023-05-18 16:28:35.0  )
కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య..
X

దిశ, నవాబుపేట: కాళ్ల పారాణి ఆరకముందే క్షణికోద్రేకానికి గురై నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట పరిధి గురుకుంట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గురుకుంట గ్రామానికి చెందిన బోయిని శివశంకర్ అదే గ్రామానికి చెందిన పిల్లి అనూష (19)లు ప్రేమించుకోగా ఇరువురి సామాజిక వర్గాలు ఒకటే కావడంతో ఇరుకుటుంబాల పెద్దలు పంచాయితీ నిర్వహించి ఈ నెల 12వ తేదీ గ్రామానికి సమీపంలో గల దరిపల్లి గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వివాహం జరిపించారు. వివాహం అయిన తర్వాత ఇరు కుటుంబాల వారు సామరస్యంగానే మెలిగారు.

పెళ్లితంతు మొత్తం ముగిసిన తర్వాత బుధవారం తల్లిగారి ఇంటి వద్ద ఉన్న అనూషను తన వెనుక తమ ఇంటికి పంపాలని అత్తగారింటికి వచ్చిన ఆమె భర్త శివశంకర్ అత్త అంజమ్మను కోరాడు. ఆ సమయంలో అతనితో గొడవపడిన అంజమ్మ తన కూతురిని ఇప్పుడే అతనితో పంపనని తెగేసి చెప్పి, అనూషను ఇంటి వద్దనే వదిలేసి తన చిన్న కూతురుతో కలిసి మహబూబ్ నగర్ కు బయలుదేరి వెళ్ళింది. అంజమ్మ ఇంటి నుంచి చిన్న కూతురుతో కలిసి మహబూబ్ నగర్ కు బయలుదేరిన వెంటనే క్షణికోద్రేకానికి గురైన అనూష ఇంట్లోనే ఉన్న క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఆ సమయంలో ఇంటి ముందు నుంచి వెళ్తున్న పొరుగు ఇంటి మహిళ అనూష వాంతులు చేసుకోవడం చూసి విషయం తల్లి అంజమ్మకు చేరవేసింది. విషయం తెలుసుకున్న అంజమ్మ అల్లుడు శివ శంకర్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో అతడు తన బందుమిత్రుల సహాయంతో అనుషను వెంటనే మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే రాత్రి అనూష కన్ను మూసింది. ఈ విషయమై మృతురాలి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపతున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు.

Advertisement

Next Story