ఎవరెస్ట్ పై ఆస్ట్రేలియా మౌంటెనీర్ మృతి

by Javid Pasha |
ఎవరెస్ట్ పై ఆస్ట్రేలియా మౌంటెనీర్ మృతి
X

న్యూఢిల్లీ : ఎవరెస్ట్ శిఖరాన్ని 8,849 మీటర్లు అధిరోహించాననే అతడి సంతోషం ఎంతోసేపు నిలువలేదు. ఎవరెస్ట్ శిఖరం నుంచి దిగి వస్తూ .. మార్గం మధ్యలోనే ఆకస్మికంగా మృతిచెందాడు. ''డెత్ జోన్'' అని పిలిచే 8000 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రమాదకర ప్రాంతంలో శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. మృతిచెందిన ఔత్సాహిక పర్వతారోహకుడిని ఆస్ట్రేలియాలోని పెర్త్ కు చెందిన జేసన్ బెర్నార్డ్ కెన్నిసన్ (40) గా గుర్తించారు. " ఎవరెస్టు క్యాంప్ 3లోని డెత్ జోన్ ఏరియాకు చేరుకోగానే జేసన్ అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఈక్రమంలో మేం అతడిని డెత్ జోన్ దాటించే ప్రయత్నం చేశాం. ఈక్రమంలో మా ఆక్సిజన్ సిలిండర్లు అయిపోయాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మేం కిందనున్న ఎవరెస్టు క్యాంప్ 4కు వెళ్లి .. ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొని మళ్ళీ జేసన్ దగ్గరికి వద్దామని అనుకున్నాం. మేం ఆక్సిజన్ సిలిండర్లతో వెనక్కి వచ్చి చూసే సరికి.. క్యాంప్ 3 లో జేసన్ చనిపోయి కనిపించాడు" అని అతడికి హెల్పర్లుగా వ్యవహరించిన ఇద్దరు షెర్పా గైడ్లు తెలిపారు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 17 ఏళ్ళ క్రితం (2006లో) ఓ కారు ప్రమాదంలో జేసన్ వెన్నెముక బాగా దెబ్బతింది. దీంతో అతను నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఇక ఎప్పటికీ అతడు నడవలేడని డాక్టర్లు చెప్పారు. అయినా వెన్నెముక గాయాల నుంచి కోలుకున్నాక.. జేసన్ పట్టుదలతో ఫిట్ నెస్ ను సాధించి తనకెంతో ఇష్టమైన పర్వతారోహణ ప్రాక్టీస్ చేశాడు. అనుకున్న విధంగా ఎవరెస్టు అంచులను తాకిన ఆనందాన్ని తన వారితో పంచుకోకముందే.. జేసన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. దీనిపై జేసన్ కుటుంబ సభ్యులు ఫేస్ బుక్ వేదికగా స్పందిస్తూ.. "ఎవరెస్ట్ అధిరోహించాలన్న లక్ష్యాన్ని జేసన్ సాధించాడు. కానీ ఇంటికి తిరిగి రాలేకపోయాడు" అని ఆవేదన వ్యక్తం చేశారు. "అతను ధైర్యవంతుడు. మేము ఎప్పటికీ అతడిని మిస్ అవుతూనే ఉంటాం" అని రాసుకొచ్చారు.



Advertisement

Next Story