ఆ కుటుంబంలో అందరూ గంజాయి స్మగ్లర్లే..

by Sridhar Babu |
ఆ కుటుంబంలో అందరూ గంజాయి స్మగ్లర్లే..
X

దిశ, భద్రాచలం : ఆ కుటుంబంలో అందరూ గంజాయి స్మగ్లర్లే. కుటుంబ పోషణకు గంజాయి విక్రయాన్ని ఎంచుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కారు. ఒకేరోజు ఐదు సంఘటనల్లో కోటి రూపాయల విలువైన 319 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 10 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ దాడులలో గంజాయి స్మగ్లర్లు మునవర్ అలీ, దత్తు అనే వ్యక్తులను అరెస్ట్​ చేసినట్టు పేర్కొన్నారు. మునవర్ అలీపై ఇప్పటి వరకు 9 గంజాయి కేసులు నమోదయ్యాయని తెలిపారు. మరో కేసులో తల్లి, తండ్రి, కుమారుడు నిందితులని చెప్పారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల అపర్ణ, ఆమె కుమారుడు అఖిల్ ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు నుండి కారులో 100 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు.

అపర్ణ భర్త సదయ్య కూడా గంజాయి వ్యాపారమే చేస్తున్నాడు. ఇతను గతంలో అనేకసార్లు గంజాయి తరలిస్తూ పట్టుబడి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అలాగే బేగంబజార్ కు చెందిన దత్తు పంచాల్ అనే వ్యక్తి కూడా 180 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. మరో కేసులో 14 కేజీల గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో ఫతేనగర్, బాలనగర్ కు చెందిన శక్తి రాహుల్, గోపిశెట్టి అక్షిత్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే మరో కేసులో 25 కేజీల గంజాయిని పట్టుకున్నామని, వీరందరూ స్మగ్లర్ మునవర్ అలీ కోసమే గంజాయి తరలిస్తూ ఒకే రోజు పట్టుబడ్డారని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఈఎస్ జానయ్య, సీఐ రహీమున్నీసాబేగం తెలిపారు. భద్రాచలం ఎక్సైజ్ చెక్​పోస్టు వద్ద పట్టుకున్న ఈ ఐదు కేసులలో 319 కేజీల గంజాయితో పాటు రెండు కార్లు, ఒక స్కూటీ, రెండు బైకులు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

Next Story

Most Viewed