ట్రీట్మెంట్ కోసం తీసుకొస్తే డాక్టర్నే చంపేశాడు

by Javid Pasha |   ( Updated:2023-05-10 08:30:00.0  )
ట్రీట్మెంట్ కోసం తీసుకొస్తే డాక్టర్నే చంపేశాడు
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలోని కొట్టక్కరలో దారుణం జరిగింది. ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చిన ఓ వ్యక్తి డాక్టర్ పై దాడి చేసి చంపేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్టక్కరకు చెందిన ఓ వ్యక్తి తనపై కుటుంబ సభ్యులు దాడి చేసి కొడుతున్నారని ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేసి చెప్పాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. గాయాలతో ఉన్న ఆ వ్యక్తిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఓ యువ డాక్టర్ అతడికి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించింది. అయితే అంతలోనే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి కత్తెర, ఆపరేషన్ కు ఉపయోగించించే కత్తులతో ఆ డాక్టర్ పై దాడి చేశాడు.

దీంతో భయంతో ఆపరేషన్ థియేటర్ నుంచి ఆ డాక్టర్ బయటకు పరుగులు పెట్టింది. గమనించిన పోలీసులు దుండగుడిని ఆపేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన డాక్టర్ ను మెరుగైన చికిత్స కోసం తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక డాక్టర్లు ధర్నాకు దిగారు. ప్రాణాలు కాపాడే డాక్టర్ల ప్రాణాలకే రక్షణ లేకపోతే ఎలా అని పోలీసులను ప్రశ్నించారు. కాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సమాచారం అందుకున్న కేరల సీఎం విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Advertisement

Next Story