నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల ముఠా అరెస్ట్.. వివరాలు వెల్లడించిన గద్వాల ఎస్పీ సృజన

by Kalyani |   ( Updated:2023-04-27 10:45:15.0  )
నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల ముఠా అరెస్ట్.. వివరాలు వెల్లడించిన గద్వాల ఎస్పీ సృజన
X

దిశ, గద్వాల క్రైమ్: రోడ్డు రవాణ కార్యాలయాలలో ఉన్న లొసుగులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుకూలంగా మలుచుకొని నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు, చలాన్లు తయారు చేస్తూ ప్రభుత్వాన్ని, ఇన్సూరెన్స్ కంపెనీలను, వాహనాల యాజమాన్యాలను మోసం చేస్తూ అక్రమ మార్గంలో సంపాదనకు పాల్పడుతున్న 17 మంది ముఠా సభ్యులను జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సృజన వివరాలు వెల్లడించారు.


కర్నూలు జిల్లాకు చెందిన మీసాల రామస్వామి ఆర్టీఏ ఏజెంట్. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, రోడ్డు రవాణ కార్యాలయాలలో ఉన్న లొసుగులు, పరిచయాలను అనుగుణంగా మలుచుకొని లారీలు, పాఠశాలల బస్సులు, తదితర వాహనాలకు సంబంధించిన ఫిట్ నెస్ తదితరాలకు సంబంధించిన చలాన్లు, ఇన్సూరెన్స్ ప్రభుత్వానికి చెల్లించకుండా, తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీవి సృష్టించి వాటితో పనులు కానిచ్చేవాడు. ఈ విషయంలో అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో అతని అక్రమాలను కర్నూలు జిల్లా నుంచి పక్కనే ఉన్న నంద్యాల, గద్వాల, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నల్గొండ తదితర జిల్లాలకు విస్తరించాడు. కొంతమంది ఆర్టీఏ ఏజెంట్లు, ఆటో ఫైనాన్స్ నిర్వాహకులు, పలువురు డ్రైవర్లను తన ఏజెంట్లుగా నియమించుకొని పనులు కానిస్తూ వచ్చాడు.

వచ్చిన డబ్బుల్లో తాను 50 శాతం తీసుకొని, మిగిలిన వాటిని తన ఏజెంట్లకు పంచుతూ అక్రమ సంపాదనలకు తెర లేపారు. ఇందుకు సంబంధించి జోగులాంబ గద్వాల పోలీసులకు కొంతమంది బాధితులు, ఇన్సూరెన్స్ కంపెనీల నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ సృజన, పోలీసులు విచారణను చేపట్టారు. రామస్వామిని అదుపులోకి తీసుకొని విచారణ జరపడంతో మొత్తం 17 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. కర్నూలు జిల్లాకు చెందిన రామస్వామితో పాటు చంద్రకుమార్, రవికుమార్, మాధవ స్వామి, రంగన్న, రఘునాథ్, ప్రవీణ్ కుమార్, నంద్యాల జిల్లాకు చెందిన శ్రీకాంత్, నగేష్, నల్గొండ జిల్లాకు చెందిన లక్ష్మయ్య ఉండగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సుధాకర్, విశ్వనాథ్, మధుసూదన్, కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ కు చెందిన షఫీ, సురేష్ గౌడ్, వనపర్తికి చెందిన ప్రేమ్ కుమార్ తదితరులను గురువారం అలంపూర్, కర్నూల్ చౌరస్తాలలో అరెస్ట్ చేశారు.


నిందితుల నుంచి ఒక కారు, రెండు కలర్ ప్రింటర్స్, రెండు ల్యాప్ టాప్స్, నకిలీ ఆర్సీలు, ఇన్సూరెన్స్ పత్రాలు, ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన లోగోలతో కూడిన డాక్యుమెంట్స్,1 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాను అరెస్టు చేయడంలో ప్రధాన భూమిక పోషించిన గద్వాల డీఎస్పీ రంగస్వామి, అలంపూర్ సీఐ సూర్య నాయక్ సారధ్యంలో కృషి చేసిన ఎస్ఐలను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story