ఉగాండా పాఠశాలలో మారణహోమం.. 41 మంది మృతి!

by Javid Pasha |
ఉగాండా పాఠశాలలో మారణహోమం.. 41 మంది మృతి!
X

కంపాలా : ఉగాండాలో సాయుధ తిరుగుబాటుదారులు మారణహోమం సృష్టించారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు కాంగో సరిహద్దుకు సమీపంలోని ఎంపాండ్వే పట్టణంలో ఉన్న లుబిరిహా సెకండరీ పాఠశాలపై 20 మంది మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. హాస్టల్ బిల్డింగ్ కు నిప్పుపెట్టారు. దీంతో 38 మంది విద్యార్థులతో పాటు మరో ముగ్గురు (సెక్యూరిటీ గార్డు, ఇద్దరు స్థానికులు) మృతిచెందారు. ఈ ఘటనలో చాలామంది స్టూడెంట్స్ అగ్నికీలల్లో సజీవ దహనం కాగా, మరికొందర్ని మిలిటెంట్లు అమానుషంగా కత్తులతో నరికి చంపారు. పలువురు తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అలైడ్ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌ (ఏడీఎఫ్)కు చెందిన మిలిటెంట్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. స్కూల్ లోని ఆహారశాలలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ను మిలిటెంట్లు దోచుకున్నారు.

దాడికి పాల్పడిన అనంతరం వారు విరుంగా నేషనల్ పార్కు వైపు పారిపోయారని, సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మిలిటెంట్లు పోరాస్ సరిహద్దు గుండా కాంగో లోపలికి పారిపోయినట్లు ఉగాండా మిలిటరీ అధికారులు పేర్కొన్నారు. మిలిటెంట్లు వెళ్తూ వెళ్తూ ఆరుగురిని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. 1986 నుంచి ఉగాండాలో అధికారంలో ఉన్న అధ్యక్షుడు యోవేరి ముసెవెని పాలనను ఏడీఎఫ్‌ వ్యతిరేకిస్తోంది. 2001లో ఉగాండా సైన్యం ఎదురుదాడులు జరపడంతో ఏడీఎఫ్‌ మిలిటెంట్లు తూర్పు కాంగోలోకి పారిపోయి.. అక్కడి నుంచి వచ్చి హింసకు పాల్పడి పారిపోతున్నారు. కాంగో బార్డర్ లోని గ్రామాల్లో ఆశ్రయం పొందుతున్న ఏడీఎఫ్‌ మిలిటెంట్లపై 2021లో ఉగాండా ఆర్మీ వైమానిక దాడులు, ఫిరంగి దాడులు చేసింది.

Advertisement

Next Story