ఢిల్లీలో దారుణం.. 10 వేల అప్పు కోసం అక్కాచెల్లెళ్ల దారుణ హత్య

by Vinod kumar |   ( Updated:2023-06-18 11:53:03.0  )
ఢిల్లీలో దారుణం.. 10 వేల అప్పు కోసం అక్కాచెల్లెళ్ల దారుణ హత్య
X

న్యూఢిల్లీ : ఓ వ్యక్తి బాకీ ఉన్న రూ.10వేల అప్పు కోసం.. అతడి ఇద్దరు సిస్టర్స్ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న అంబేద్కర్‌ బస్తీలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పింకీ(30), జ్యోతి(29) అనే అక్కాచెల్లెళ్ళు చనిపోయారు. ఆదివారం తెల్లవారుజామున 4:40 గంటలకు 15 నుంచి 20 మంది సాయుధ వ్యక్తులు వచ్చి పింకీ, జ్యోతి ఇంటి తలుపు తట్టారు. అయినా వారు తలుపులు తెరవకపోవడంతో.. ఇంటిపైకి ఇటుకలు విసిరారు. ఎంతకూ తలుపులు తెరవకపోవడంతో వారు వెళ్లిపోయారు. అనంతరం పింకీ, జ్యోతి వారి సోదరుడు లలిత్ బయటకు వచ్చి.. ఇంటిపై దాడి చేసిన వారి గురించి ఇరుగుపొరుగు వారిని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో దుండగులు మళ్ళీ వచ్చి కాల్పులు జరిపారు. పింకీ, జ్యోతి.. ఛాతీ, కడుపులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. వారి సోదరుడు లలిత్‌ కు ఒక బుల్లెట్ మాత్రమే తగలడంతో ప్రాణాపాయం తప్పింది.

పింకీ, జ్యోతి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి మేఖేల్, దేవ్, అర్జున్ అనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రూ.10వేల అప్పు విషయంలో స్థానికంగా దేవ్ అనే వ్యక్తితో కొంతకాలంగా తనకు గొడవలు జరుగుతున్నాయని పోలీసులకు లలిత్‌ చెప్పాడు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో పౌరులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థను లెఫ్టినెంట్ గవర్నర్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. పోలీస్ వ్యవస్థ ఆప్ సర్కారు చేతిలో ఉంటే ఢిల్లీ సురక్షితంగా ఉండేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed