కొడుకును ట్రాక్టర్‌ పై నుంచి దించి తండ్రి మృతి

by Sumithra |
కొడుకును ట్రాక్టర్‌ పై నుంచి దించి తండ్రి మృతి
X

దిశ, స్టేషన్ ఘనపూర్: అప్పటి వరకు ట్రాక్టర్ తో పొలం దున్నుతున్న కొడుకును వారించిన తండ్రి అదే ట్రాక్టర్ ప్రమాదంలో మృత్యువాత పడిన విషాదకర సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం లక్ష్మీ తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… నేనావత్ హుస్సేన్ (48) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెద్ద కుమారుడు వ్యవసాయ పనుల్లో తండ్రికి సాయం చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పొలం దున్నుతున్న క్రమంలో కుమారుడికి డ్రైవింగ్ లో పూర్తి నైపుణ్యత లేదని ట్రాక్టర్ పై నుంచి దించాడు. కొద్ది సేపటికి అదే ట్రాక్టర్ నడుపుతూ హుస్సేన్ పొలం ఒడ్డు చెక్కుతుండగా టైర్ పట్టు కోల్పోయి పక్క పొలంలో బోల్తాపడింది. హుస్సేన్ తల వాహనం బానాట్ లో ఇరుక్కుని అక్కడిక్కడే మృతి చెందాడు. తనను ట్రాక్టర్ దింపి ఉండకపోయి ఉంటే తండ్రి ప్రాణాలతో ఉండేవాడిని, తనకు జాగ్రత్తలు చెప్పిన తండ్రి మరణించడంతో అతడి రోదనలు స్థానికులను కంట తడి పెట్టించాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story