అమరావతి రైతుల తిరుపతి సభకు రాలేము: సీపీఎం రాష్ట్రకార్యదర్శి

by srinivas |   ( Updated:2021-12-17 08:59:30.0  )
అమరావతి రైతుల తిరుపతి సభకు రాలేము: సీపీఎం రాష్ట్రకార్యదర్శి
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి జేఏసీ తిరుపతిలో తలపెట్టిన మహా పాదయాత్ర ముగింపు సభకు రాలేమని సీపీఎం స్పష్టం చేసింది. సభకు హాజరుకావాలంటూ అన్ని పార్టీల అధ్యక్షులకు అమరావతి జేఏసీ ఆహ్వానాలు పంపింది. అయితే సభకు రాలేమని అమరావతి జేఏసీ కన్వీనర్‌కు సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు లేఖ రాశారు. సభకు తమను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘రాజధానిని ముక్కలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నష్టదాయకం. అమరావతి రైతు కూలీలకు, ప్రజలకు ఇచ్చిన చట్టబద్దమైన హామీలను నీరుగార్చింది.

పరిపాలన, శాసన రాజధాని అమరావతిలోనే కొనసాగాలని సీపీఎం నిశ్చితాభిప్రాయం. రైతు ఉద్యమానికి గతంలో మద్దతు తెలిపాం. భవిష్యత్తులోనూ మా మద్దతు కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్ణయానికి మాకు సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. పలుసార్లు పార్లమెంట్ లో అమరావతిని గుర్తించడానికి నిరాకరించింది. అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించ లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పలు విషయాలలో బీజేపీ దగా చేసింది. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని అమరావతి ఉద్యమ సభలకు, కార్యక్రమాలకు బీజేపీని పిలవాలనే జెఎసి వైఖరి దురదృష్టకరం.

మీ ఆహ్వానం అందగానే మేము తిరుపతి సభకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాము. కానీ మీరు బీజేపీ నేతలను తిరుపతి సభకు ఆహ్వానించడంతో మేము విరమించుకోవాల్సి వచ్చింది. బీజేపీతో కలిసి వేదిక పంచుకోలేమని తెలియజేస్తున్నాం’ అని లేఖలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. రాజధానిని ముక్కలు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది సీపీఎం విధానమని మధు క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed