రైతు వ్యతిరేక చట్టాలను సాగనివ్వం : తమ్మినేని

by Shyam |
రైతు వ్యతిరేక చట్టాలను సాగనివ్వం : తమ్మినేని
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్‌లో భారీ ర్యాలీ తీశారు. అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని సరూర్‌నగర్‌ నుంచి ఉప్పల్‌ వరకూ వాహనాలతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ర్యాలీలో సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ… రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన, ప్రమాదకర వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణం మీదకు వచ్చినా.. ఉద్యమం ఆపేది లేదని అన్నారు. అంతేగాకుండా దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అవాంఛనీయ ఘటనలు జరుగడం బాధాకరం అన్నారు. ఆందోళనలోకి కొన్ని శక్తులు చొరబడ్డాయని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల తుపాకీ గుళ్లకు బయపడేది లేదని స్పష్టం చేశారు. కాగా, సాయంత్రం 5 గంటలకు ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద ఈ ర్యాలీ ముగియనుంది. వాహన ర్యాలీ సాగుతున్న మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed