‘సోషలిజం ద్వారానే సమాంతర వ్యవస్థ సాధ్యం’

by Shyam |
Joolakanti Rangareddy
X

దిశ, మిర్యాలగూడ: కమ్యూనిస్టు పార్టీలకు అధికారం కల్పించడం ద్వారానే పేద, మధ్య తరగతి ప్రజలు, కార్మికుల సంక్షేమం సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సీపీఎం నల్గొండ జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో ఆయన పార్టీ ప్రతినిధులకు మార్గదర్శనం చేశారు. సోషలిజం ద్వారానే సమాంతర వ్యవస్థ సాధ్యమని, ఆ దిశగా పని చేసే వామపక్ష పార్టీలను ప్రజలు బలపరచాలని కోరారు. కేరళ రాష్ట్రంలో ఆదర్శ పాలన సాగించిన సీపీఎం రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. వ్యవసాయ సంక్షోభం నుండి రైతులను గట్టెక్కిస్తానన్న మోదీ, రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి కూలీలుగా మార్చుతున్నాడని ఆరోపించారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదలు నిత్యావసర వస్తు సరుకులు దక్కనీయడం లేదన్నారు. ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తానని ప్రభుత్వరంగ సంస్థలని ప్రైవేట్ వారికి ధారాదత్తం చేయడం మోసపూరితమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు పోతున్నదని, కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఒక విధంగా, లేనప్పుడు మరో విధంగా చౌకబారు మాటలతో మోసపూరిత పాలన సాగిస్తుందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సీపీఎం మహాసభలు వేదిక కావాలని, శాఖ, మండల, జిల్లా మహాసభలలో సమస్యలు చర్చించి ప్రజా ఉద్యమాలకు పార్టీ శ్రేణులు, సానుభూతి పరులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బీకార్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ విస్తృతస్థాయి సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, నారి అయిలయ్య, పాలడుగు నాగార్జున, కున్ రెడ్డి నాగిరెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీశ్ చంద్ర, గౌతమరెడ్డి, రవినాయక్, రామూర్తి, శశిధర్ రెడ్డి, ఎండీ అంజద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed