ప్రధాని మోడీ ఒక 420 : సీపీఐ నారాయణ

by Anukaran |
ప్రధాని మోడీ ఒక 420 : సీపీఐ నారాయణ
X

దిశ, ముషీరాబాద్: రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించాలని వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు, సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం, న్యూ డెమోక్రసీ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శులు పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. హామీలు అమలు చేయని ప్రధాని మోదీ ఒక 420 అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారంతా దేశద్రోహులేనని విమర్శించారు. రైతు లేని ఉద్యమం అని అంటున్న బీజేపీ నాయకులు కంప్యూటర్లకు పుట్టి ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాలు అమలు అయితే అంబానీ, ఆదానీలకు రైతులు బానిసలుగా మారాల్సి వస్తుందని అన్నారు. చట్టాలని వ్యతిరేకించేందుకు కేసీఆర్, జగన్‌లు వెనకాముందు అవుతున్నారని, రైతులను కలిస్తే మోడీ, అమిత్ షా ఏం చేస్తారోనని భయపడుతున్నారు అన్నారు.

అనంతరం బీవీ రాఘవులు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేసి, రైతులకు ప్రయోజనం కలిగించే చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. మూడు వ్యవసాయ చట్టాలపై పార్లమెంటులో చర్చ జరగలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతు సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బీజేపీ నాయకులు దేశభక్తులైతే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి వారికి అనుకూలమైన చట్టాలను చేయాలని కోరారు.

Advertisement

Next Story