‘బీజేపీ దేశ ద్రోహులకు కొమ్ము కాస్తోంది’

by Shyam |
‘బీజేపీ దేశ ద్రోహులకు కొమ్ము కాస్తోంది’
X

దిశ, న్యూస్‌బ్యూరో : బ్యాంకులను కొల్లగొట్టి విదేశాల్లో తలదాచుకున్న దేశ ద్రోహులకు మోదీ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన ద్వారా పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలోని వివిధ జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న దొంగ రుణాలను ఆర్బీ‌ఐ రద్దు చేయడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రూ.68 వేల కోట్ల బ్యాంకు రుణాలు పొందిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇతర బడా పారిశ్రామికవేత్తల రుణాలు రద్దు చేయడం ఎంత వరకు సమంజసం అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రూ.68 వేల కోట్ల రూపాయలను దేశంలోని 35 కోట్ల మంది పేదలకు రూ.15 వేల చొప్పున పంపిణీ చేసినా ఇంకా మిగులుతాయని నారాయణ పేర్కొన్నారు.

కేరళ ప్రభుత్వం.. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి కుటుంబానికి 19 రకాల నిత్యావసర వస్తువులను ఇంటింటికీ పంపిణీ చేస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. దేశంలోని వలస కార్మికులను ఆదుకుంటామని ప్రధాన‌మంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా నిరంతరం ప్రకటనలు గుప్పించడం తప్ప ఆచరణ శూన్యమని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రుణఎగవేతదారుల రుణాలను రద్దు చేసిందని ఆరోపించారు.

Tags: BJP, Modi, CPI, Narayana,Neerav Modi,Vijay Malya, Industrial, Loans, Cancellation

Advertisement

Next Story