హరితహారం పేరుతో భారీ కుట్ర.. కేసీఆర్‌పై పోటు రంగారావు ఆగ్రహం

by Sridhar Babu |
CPI (ML) leader Potu Ranga Rao
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో సీపీఐఎమ్ఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పోడు పోరు యాత్రలో భాగంగా సుమారు ఐదువేల మందితో సోమవారం భారీ ర్యాలీ తీశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం, ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య పాల్గొని మద్దతు తెలిపారు.

CPI (ML) leaders

ఈ సందర్భంగా సీపీఐఎమ్ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. అనాదిగా అడవుల్ని నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీ, గిరిజనులను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల పెంపు, పచ్చదనం హరితహారం కార్యక్రమాల పేరుతో కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ఫారెస్ట్ శాఖ పోలీసు వారి సహకారంతో ఆదివాసీల పంటపొలాలను నాశనం చేస్తూ, పొలాల చుట్టు కందకాలు తవ్వుతున్నారని అడ్డు వచ్చిన వారిపై దాడులు చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, ఆదివాసీ, పేదలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, రైతాంగ వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని ఆదివాసీ గిరిజనులకు భూములపై హక్కులు కల్పించాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సాగు భూములకు రక్షణ కల్పించి రైతుబంధు పథకం అమలు చేయాలని కోరారు.

ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి ఆదివాసీలకు అన్ని హక్కులను కల్పించిందని, కానీ, ఆ హక్కులు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఆదివాసీ హక్కులను హరిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం తలపెట్టామన్నారు. గిరిజనులు గత 40 ఏండ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమాయకులైన గిరిజనులపై యుద్ధం ప్రకటించి ఫారెస్ట్ అధికారులు, పోలీసులతో భూములు గుంజుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు ప్రవేశపెట్టిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. తక్షణమే పోడు చేసుకొనే ఆదివాసీలకు పట్టాలు మంజూరు చేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి అందించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ చట్టాలను అతిక్రమించి అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed