రైతులను రెచ్చగొట్టింది ఎమ్మెల్యే కాంతారావే.. సీపీఐ నేత చాడ ఆగ్రహం

by Sridhar Babu |
CPI leader Chada Venkat Reddy
X

దిశ, మణుగూరు: పోడు రైతులను ఫారెస్ట్ అధికారులపైకి తిరగబడమని రెచ్చగొట్టింది పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం పినపాక నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, విస్మరించిందని విమర్శించారు. పోడు గిరిజనులకు పట్టాలు ఇస్తానని మోసం చేశారని మండిపడ్డారు. గిరిజనులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య చిచ్చు పెట్టడం పెట్టి గిరిజనుల జీవితాలను ప్రశ్నార్థకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైందని, దళితబంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, కేవలం ఉపఎన్నికలు వచ్చినచోట మాత్రమే అమలు చేయడం ఎన్నికల ఎత్తుగడే అన్నారు.

ఇక రాష్ట్రంలో కేసీఆర్ గారడీ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జల వివాదాల సమస్యలను కేంద్రం చొరవ తీసుకొని పరిష్కరించాలన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ఒక్క ఎకరానికి రూ.25 లక్షలు చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నేత కూనంనేని సాంబశివరావు, నాయకులు రామమూర్తి, ఎస్కే సర్వర్, సుధాకర్, అక్కి నర్సింహారావు, పాయం శ్రీను, మనోహర చారి, పత్తిపాటి నాగేశ్వరరావు, మల్లిఖార్జున్, పేరాల శ్రీను, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story