కేసీఆర్.. పేదల ఉసురు తగిలి పోతావ్.. చాడ వెంకట్ రెడ్డి వార్నింగ్

by Shyam |
CPI leader Chada Venkat Reddy
X

దిశ, భద్రాచలం: ‘‘కుర్చీ వేసుకొని కూర్చొని పోడు భూములు పంచుతా అన్న ఓ కేసీఆర్, హరితహారం పేరుతో ఫారెస్టు పోలీసులను భూములపైకి పంపి బలవంతంగా లాక్కోవడానికి చూస్తున్నావు. నీ పద్ధతి మారకపోతే పేదల ఉసురు తగిలి పోతావ్’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదురోజుల క్రితం కొమురం భీమ్ ఝోటే ఘాట్ నుంచి ప్రారంభమైన పోడు యాత్ర ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని దేవరాపల్లి గ్రామంలో ముగిసింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ముగింపు సభ నిర్వహించారు. ఫారెస్టు, పోలీసు అధికారుల నుంచి పోడు భూములు దక్కించుకోవడానికి మన్యంలో గిరిజనులు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ నిలకడలేని నిజ స్వరూపం ప్రజలకు అర్థం అవుతోందన్నారు.

ఏడున్నరేండ్ల కేసీఆర్ పాలన ఆయన కుటుంబానికి, బంధుమిత్రులకు మాత్రమే లాభం చేకూర్చిందని, నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడు వచ్చినా కేసీఆర్‌ను గద్దె దింపడం ఖాయం అని జోస్యం చెప్పారు. ఉద్యమకారుడివి, బంగారు తెలంగాణ తెస్తావనుకుంటే బాధల తెలంగాణ రుచి చూపిస్తున్నావని ఆరోపించారు. నీ వైఖరి మార్చుకొని లోపాలు సరిచేసుకోకపోతే ప్రజలు తిరగబడే రోజు తొందర్లోనే వస్తోందని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ.. పేదల భూపోరాటానికి సీపీఐ ఏ సమయంలోనైనా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య, మల్లేశ్, రాంప్రసాద్, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, రవికుమార్, తాతాజీ పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed