థర్డ్‌వేవ్‌ తథ్యం.. సమయం ఆసన్నమైంది

by Shamantha N |
Covid third wave
X

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో రాష్ట్రాలు క్రమంగా ఆంక్షలను సడలిస్తున్నాయి. దీంతో ప్రజలు కనీస నిబంధనలు మరిచి ఒకే చోట గుమిగూడుతున్నారు. పర్యాటక ప్రాంతాలకు పయనమవుతున్నారు. థర్డ్ వేవ్‌ హెచ్చరికలు వస్తున్నప్పటికీ లైట్ తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చూపిస్తూ కేంద్ర హోంశాఖ ఇటీవలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇదే విషయంపై తాజాగా, ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’(ఐఎంఏ) సైతం స్పందించింది. కరోనా ఆంక్షలను కనీసం మరో మూడు నెలల వరకు సడలించకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘టూరిస్ట్ బొనాంజా, తీర్థయాత్రలు, మతపరమైన వేడుకలు.. ఇవన్నీ మనకు అవసరమే. కానీ, ఒక్క మూణ్నెళ్లు ఓపిక పట్టండి’ అంటూ వేడుకుంది.

‘కరోనా సెకండ్ వేవ్‌ నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. అయితే, గతంలో వచ్చిన ఏ మహమ్మారి చరిత్ర చూసినా థర్డ్ వేవ్ తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం అది ఆసన్నమైన సంకేతాలూ కనిపిస్తున్నాయి. అయితే, వేగవంతమైన వ్యాక్సినేషన్, కరోనా నిబంధనలకు కట్టుబడి ఉండటం వంటి చర్యల ద్వారా మన దేశం థర్డ్ వేవ్ తీవ్రతను తట్టుకోగలదు’ అని వెల్లడించారు. ‘థర్డ్ వేవ్‌ తీవ్రతను తగ్గించడంలో ప్రతి ఒక్కరూ నిమగ్నమై ఉండాల్సిన కీలక సమయంలో దేశంలోని అనేక చోట్ల నిబంధనలు మరిచి ప్రజలు భారీ ఎత్తున గుమిగూడటం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తున్నది’ అని తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకోనివారిని పర్యాటక ప్రదేశాలు, తీర్థయాత్రలకు అనుమతిస్తే వారు సూపర్ స్ప్రెడర్స్‌గా మారి థర్డ్ వేవ్‌కు దోహదపడే ముప్పు ఉందని హెచ్చరించారు. కావునా మరో మూడు నెలల దాకా కొవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed