వరవరరావుకు కరోనా పాజిటివ్

by Anukaran |   ( Updated:2020-07-16 11:44:39.0  )
వరవరరావుకు కరోనా పాజిటివ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న వరవరరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జేజే ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయనను జైలు అధికారులు నవీ ముంబయిలోని జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పలు రకాల పరీక్షలతో పాటు కరోనా పరీక్ష కూడా నిర్వహించారు. పాజిటివ్ వచ్చినట్లు జేజే ఆసుపత్రి డీన్ డాక్టర్ రంజిత్ మాణికేశ్వర్ తెలిపారు. త్వరలోనే కొన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి సెయింట్ జార్జి ఆసుపత్రికి తరలించనున్నట్లు గురువారం సాయంత్రం అక్కడి మీడియా ప్రతినిధులు తెలిపారు.

రాత్రి పది గంటల వరకు ఆయనను సెయింట్ జార్జి ఆసుపత్రికి తరలించలేదని జేజే ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ ఆ లక్షణాలేవీ వరవరరావులో బహిర్గతం కాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ రంజిత్ తెలిపారు. ప్రస్తుతం ఆయనకు శ్వాసపరమైన ఎలాంటి ఇబ్బందులు లేవని, కరోనా లక్షణాలేవీ కనిపించడంలేదని, వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, కానీ చికిత్సకు కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు.

కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, కుటుంబ సభ్యుల వత్తిడి మేరకు నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న వరవరవరావును తలోజా జైలు అధికారులు జేజే ఆసుపత్రికి తరలించారు. తొలుత పెరోల్ మీద విడుదల చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహా రాష్ట్రపతి వరకు ఎన్ని విజ్ఞప్తులు వెళ్ళినా సానుకూల స్పందన రాలేదు. కానీ గత రెండు వారాలుగా ఆరోగ్యం క్షీణిస్తూ సరిగా మాట్లాడలేని పరిస్థితుల్లోకి వెళ్ళడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. జైల్లో ఉంటే కరోనా బారిన పడతారని కుటుంబ సభ్యులు నెల రోజుల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూనే ఉన్నారు. చివరకు ఏది జరుగుతుందని భయపడ్డారో అదే జరిగిందని కుటుంబ సభ్యులు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed