ఉస్మానియాలో మృతదేహాల తారుమారు..

by Anukaran |   ( Updated:2020-07-11 10:05:34.0  )
ఉస్మానియాలో మృతదేహాల తారుమారు..
X

దిశ, హైదరాబాద్: ఉస్మానియా హాస్పిటల్ మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మళ్లీ మృతదేహాలు తారుమారు అయ్యాయి. దీంతో శనివారం ఆస్పత్రి మార్చురీ వద్ద మృతుల బంధువులు నిరసన వ్యక్తంచేశారు. వివరాల్లోవెళితే.. అల్వాల్ జన్నంబండ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (45) అనారోగ్యంతో ఈ నెల 8న ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి 10వ తేదీన మరణించాడు. అయితే, అతనికి కోవిడ్ లక్షణాలు ఉండటంతో కుటుంబ సభ్యుల సమ్మతితో నమూనాలు సేకరించిన వైద్యులు ల్యాబ్‌కు పంపి.. మృత దేహాన్ని మార్చురీకి తరలించారు.

మరో కేసులో పేట్ బషీరాబాద్‌కు చెందిన వ్యక్తి (64) కొవిడ్ లక్షణాలతో 10వ తేదీన మరణించాడు. అతని మృత దేహాన్ని కూడా మార్చురీలో భద్ర పర్చారు. కాగా, అల్వాల్‌కు చెందిన మృతదేహం తాలూకు రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు శుక్రవారం ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని అప్పగించాలని కోరారు. మార్చురీ సిబ్బంది పొరపాటుగా పేట్ బషీరాబాద్‌కు చెందిన రోగి పొటోను పీఎస్‌కు పంపించి అతని మృత దేహాన్ని అల్వాల్‌కు కుటుంబీలకు అప్పగించారు. వారు మొహం చూడకుండానే ఎర్రగడ్డలోని శ్మశాన వాటికకు తీసుకువెళ్లి దహనం చేశారు.

శనివారం పేట్ బషీరాబాద్‌కు చెందిన మృతుని కుటుంబ సభ్యులు ఉస్మానియా మార్చురీకి చేరుకుని మృతదేహాన్ని అప్పగించాలని కోరారు. తీరా మార్చురీ సిబ్బంది అల్వాల్‌కు చెందిన వ్యక్తి మృత దేహాన్ని వారికి అప్పగించారు. ఈ మృతదేహం తమది కాదని బంధువులు మార్చురీ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మార్చురీ మొత్తం వెతికినా వారికి చెందిన మృతదేహం కన్పించలేదు. విషయం తెలుసుకున్న బంధువులు సిబ్బందితో గొడవకు దిగడంతో పాటు ఆందోళన చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షించారు. చివరి ప్రయత్నంగా అల్వాల్ పీఎస్‌కు పంపిన పొటోను తెప్పించడంతో వారు అసలు మృతదేహాన్ని గుర్తించారు. దీంతో మృతదేహం తారు మారైనట్లు మార్చురీ అధికారులు గుర్తించి అల్వాల్ ప్రాంతానికి చెందిన మృతుని తాలూకు కుటుంబ సభ్యులను పిలిపించారు. తాము మృత దేహాన్ని చూడకుండానే దహనం చేసినట్లు వారు పేర్కొనడంతో అధికారులు ఖంగుతిన్నారు. ఆస్పత్రి సిబ్బంది తప్పిదాన్ని గుర్తించి ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో పరిస్థితి సద్ధుమనిగింది. అనంతరం మార్చురీలోని మృత దేహాన్ని కూడా అల్వాల్‌కు చెందిన వారికే అప్పగించారు.

Advertisement

Next Story