ఢిల్లీ వాసులందరికీ కరోనా టెస్టులు : అమిత్ షా

by Shamantha N |   ( Updated:2020-06-15 04:06:11.0  )
ఢిల్లీ వాసులందరికీ కరోనా టెస్టులు : అమిత్ షా
X

న్యూఢిల్లీ: ఢిల్లీ వాసులందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అలాగే, అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నట్టు ఇక్కడ కరోనా పరీక్షలు మరింత పెంచుతామని తెలిపారు. త్వరలో రోజుకు 18వేల టెస్టులు నిర్వహిస్తామని చెప్పారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో కరోనా పరిస్థితులపై అన్ని పార్టీల నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశాన్ని నిర్వహించారు. ఆప్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్‌పీ, ఎస్‌పీ నేతలు హాజరైన ఈ సమావేశంలో ఇది వరకే ప్రకటించిన నిర్ణయాలను అమిత్ షా వెల్లడించారు. వాటి అమలుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. అలాగే, కట్టడి చర్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్‌లతో అమిత్ షా ఇది వరకే భేటీ అయిన సంగతి తెలిసిందే.

అనంతరం, ఢిల్లీలో టెస్టుల సంఖ్యను పెంచుతామని, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో టెస్టులుంటాయని తెలిపారు. ఆరు రోజుల్లో టెస్టుల సంఖ్యను మూడు రెట్లు పెంచుతామని, కరోనా పేషెంట్‌లకు పడకల కొరతను అధిగమించేందుకు 500 ట్రైన్ కోచ్‌లను అందిస్తామని ప్రకటించారు. అలాగే, హాట్‌స్పాట్ ఏరియాల్లో ఇంటింటికీ సర్వే చేసి కరోనా పేషెంట్ కాంటాక్టులను గుర్తిస్తామని వివరించారు. ఈ భేటీ అనంతరం తాజాగా, అన్ని పార్టీల నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఢిల్లీ వాసులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అది ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపింది. అలాగే, కరోనా పేషెంట్ కుటుంబీకులకు లేదా కంటైన్‌మెంట్ జోన్‌లోని ప్రతి కుటుంబానికి రూ. 10వేలు అందివ్వాలని పేర్కొంది. వైద్యుల కొరతను అధిగమించేందుకు ఫోర్త్ ఇయర్ మెడికల్ స్టూడెంట్‌లను నాన్ పర్మినెంట్ రెసిడెంట్ డాక్టర్లుగా వినియోగించాలని సూచించింది.

కాగా, బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్ ఆదేశ్ గుప్తా కూడా టెస్టింగ్ చార్జీలపై గళమెత్తారు. టెస్టుల చార్జీలను 50శాతం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో చార్జీలను ఫిక్స్ చేయాలని సూచించారు. టెస్టింగ్ ధరలపై వీకే పౌల్ కమిటీ నివేదికను సమర్పించిన తర్వాత దీనిపై నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

కరోనా టెస్టింగ్ ఖర్చులపై ఆప్ నేతలూ స్పందించారు. త్వరలో ఢిల్లీలో ఒక కరోనా టెస్టు చార్జీ రూ. 450కు తగ్గిస్తామని ఆమ్ ఆద్మీ నేత సంజయ్ సింగ్ తెలిపారు. 15 నిమిషాల్లో టెస్టు పూర్తవుతుందని వెల్లడించారు. జూన్ 18 నుంచి ఢిల్లీలో రోజుకు 18,000 టెస్టులను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed