- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పశువులకు కూడా ఈ ఫుడ్డు పెట్టరు: కరోనా పేషంట్లు
దిశ, న్యూస్ బ్యూరో:
”మా జీవితంలో ఇంత ఘోరమైన ఫుడ్డును ఎన్నడూ చూడలేదు, తినలేదు. మనం కనీసం పశువులకు కూడా ఇలాంటి ఫుడ్డు పెట్టం. అన్నం సరిగ్గా ఉడకదు. కూరలు పాచిపోయిన వాసనతో ఉంటాయి. అందులో ఉప్పు కూడా ఉండదు. షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇదే ఫుడ్డు. కనీసం వారి ఆరోగ్యం కోసం రొట్టెలు కూడా ఇవ్వరు. బెడ్‌ల చుట్టూ ఎలుకలు ఉరుకులు పరుగులు పెడుతుంటాయి…” ఇదీ గాంధీ ఆసుపత్రిలో కరోనా వార్డుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ పేషెంట్ల బాధలు. ప్రస్తుతం ‘ఆరోగ్యశ్రీ వార్డు’లో చికిత్స పొందుతున్న పదహారు మంది పాజిటివ్ పేషెంట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖ. సోమవారం రాత్రే ఈ లేఖను సీఎం అందుకున్నట్లు తెలిసింది. గంటల వ్యవధిలోనే గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ బదిలీ జరిగిపోయింది.
కరోనా వచ్చిన తొలిరోజుల్లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న తర్వాత డిశ్చార్జి అయినవారంతా ”మంచి వైద్య సేవలు అందాయి… బాగా చూసుకున్నారు… సౌకర్యంగా ఉంది..” అనే ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. కానీ కేసులు పెరుగుతున్నా కొద్దీ ఆసుపత్రి నిర్వాహకుల్లో నిర్లక్ష్యం వచ్చిందో ఏమోగానీ ప్రస్తుతం చికిత్స పొందుతున్న పేషెంట్లు మాత్రం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవల గురించి ప్రస్తావించని ఈ పేషెంట్లు ఆసుపత్రి నిర్వాహకులు సప్లయ్ చేస్తున్న ఆహార పదార్ధాల గురించి మాత్రం దుమ్మెత్తిపోశారు. పశువులకు కూడా ఇంత ఘోరమైన ఫుడ్డు పెట్టం అని వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ”బలవర్ధకమైన ఆహారం తీసుకోండి… కోడి గుడ్లు, చికెన్ తినండి.. సిట్రిక్ యాసిడ్ (పిహెచ్ ఎక్కువగా ఉండే) పండ్లను తినండి.. త్వరగా కోలుకుంటారు… శరీరంలో ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తి) పెరుగుతుంది..” అని చెప్తుంటే గాంధీ ఆసుపత్రిలోని పేషెంట్లు మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితుల్లో మగ్గుతున్నారు.
సరిగా ఉడకని బియ్యాన్నే అన్నంగా భావించి తింటున్నారు. పాచిపోయిన వాసన వచ్చే కూరలతోనే సర్దుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పప్పు సంగతి చెప్పనే అవసరం లేదని, అందులో ఉప్పు కూడా ఉండదని ఆ లేఖలో ప్రస్తావించారు. అయినా వాటినే ఎలాగోలా తినాల్సి వస్తోందని, మరో మార్గం లేదని పేర్కొన్నారు. సరైన ఫుడ్డు పెట్టరు.. ఇంటి దగ్గరి నుంచి తెచ్చకోనివ్వరు అని ఆవేదన వ్యక్తం చేశారు. పాలు, టీ, కాఫీ… ఇలాంటివేవీ లేవని పేర్కొన్నారు. అప్పుడప్పుడూ టీ వస్తున్నా అది వేడి నీళ్ళు అనుకుని తాగాల్సిందేనని పేర్కొన్నారు. షుగరు జబ్బుతో బాధపడుతున్నవారు కూడా అన్నమే తినాల్సి వస్తోందని, వారికి కనీసం రొట్టెలు కూడా ఇవ్వడంలేదని పేర్కొన్నారు. ఏ మాత్రం ఈ సర్వీస్ సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు. పేషెంట్లు పడుకునే బెడ్‌ల చుట్టూ ఎలుకలు తిరుగుతూ ఉంటాయని పేర్కొన్నారు.
సాధారణంగా ఆసుపత్రికి వస్తే వారికి చికిత్స అంది కోలుకుంటూ కాస్త ఉత్సాహంగా ఉంటారని, కానీ ఇక్కడికి వచ్చి ఎనిమిది రోజులైనా రోజురోజుకీ శారీరకంగా బలహీనంగా ఉంటున్నామని, ఉత్సాహం, యాక్టివ్‌నెస్ లేదని పేర్కొన్నారు. కొన్నిసార్లు కళ్ళు తిరుగున్నట్లు ఉంటుందన్నారు. చికిత్స తీసుకునే క్రమంలో బలవర్ధకమైన ఆహారం అవసరమైనా పశువులకు కూడా పెట్టని ఘోరమైన ఆహారం ఇస్తూ మరింత నీరసపడేలా ఇక్కడి వాతావరణం ఉందని వాపోయారు. కనీసం ఇంటి నుంచి ఫుడ్డు తెచ్చుకునే అవకాశం ఉంటే బాగుండేదని, కానీ దానికి కూడా ఒప్పుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించి సంబంధిత నిర్వాహకులపైనా, ఆహారాన్ని సప్లయ్ చేస్తున్న కేటరింగ్ సంస్థపైనా చర్యలు తీసుకుని మాలాంటి పేషెంట్లు త్వరగా కోలుకునేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
గాంధీ ఆసుపత్రిని కేవలం కరోనా పేషెంట్లకు మాత్రమే వినియోగిస్తూ ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకుంది. అక్కడ ఆ పేషెంట్లను మినహా మిగిలినవారందరినీ ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. కరోనా పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌ను రాత్రికి రాత్రి మంగళవారం వైద్యవిద్య డైరెక్టర్ కార్యాలయం తొలగించింది. హఠాత్తుగా తొలగించడానికి దారితీసిన కారణాలేంటో స్పష్టంగా వెలుగులోకి రాలేదు. పాలనాపరమైన వ్యవహారాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ కరోనా పాజిటివ్ పేషెంట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల కారణంగా ఈ నిర్ణయం జరిగి ఉండవచ్చని తెలిసింది. కానీ ఒకే వార్డుల్లో ఉన్న పదహారు మంది పాజిటివ్ పేషెంట్లు అక్కడి ఘోరమైన పరిస్థితులను ముఖ్యమంత్రికి లేఖ రూపంలో తెలియజేసిన తర్వాత ఈ చర్య తీసుకోవడం గమనార్హం. లేఖ రాయడానికి కూడా ఈ పేషెంట్లకు కాగితం దొరకకపోవడంతో పేషెంట్ల కేస్ హిస్టరీని రాయడానికి నర్సులు ఉపయోగించే ‘ప్రోగ్రెస్ షీట్’ మీదనే రాసి పంపారు.
Tags: Telangana, Corona, Gandhi Hospital, Positive Patients, AarogyaSri Ward, Letter to CM