కరోనా విరుగుడు పరిశోధనల్లో ముందడుగు

by Shamantha N |
కరోనా విరుగుడు పరిశోధనల్లో ముందడుగు
X

వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడువేల మందిని పొట్టనబెట్టుకున్న కరోనావైరస్(కోవిడ్ 19)కు విరుగుడును కనుగొనేందుకు శాస్త్రజ్ఞులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు తయారుచేసిన వ్యాక్సిన్ పరిశీలనల్లో ముందడుగు పడింది. అమెరికాలో ఈ వ్యాక్సిన్‌ను మొదటిసారి ఒక వ్యక్తిపై ప్రయోగించారు. సియాటెల్‌లోని కైజర్ పర్మినెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌజ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యాక్సిన్ స్వీకరించిన వ్యక్తిపై మొదటి దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైందని ప్రకటించేందుకు గర్విస్తున్నారని చెప్పారు. అత్యంత వేగంగా కనుగొన్న వ్యాక్సిన్‌లలో ఇదొకటని వివరించారు. ఈ వ్యాక్సిన్‌తోపాటు యాంటీ వైరల్ థెరపీలు, ఇతర చికిత్సలను అభివృద్ధి చేసే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) ఈ పరీక్షలకు నిధులు అందిస్తున్నది. ఇప్పటి వరకు కోవిడ్ 19కు గుర్తింపు పొందిన ఔషధం లేదని ఎన్ఐహెచ్ తెలిపింది. ఎంఆర్ఎన్ఏ అనే జెనెటివ్ వేదిక ఆధారంగా ప్రస్తుత వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు వివరించింది. కరోనావైరస్‌కు సారూప్యంగా ఉండే ఎస్ఏఆర్ఎస్, ఎంఈఆర్ఎస్‌లపై ఇదివరకే చేసిన విస్తృత పరిశోధనలు.. కోవిడ్ 19‌కు వేగంగా విరుగుడు కనిపెట్టడంలో పనికొచ్చాయని శాస్త్రజ్ఞులు తెలిపారు.

Tags: coronavirus, vaccine, clinical trial, US, investigational vaccine, mRNA, first phase

Advertisement

Next Story

Most Viewed